- దశాబ్దాలుగా సామ్ సంగ్ ఫ్లిప్ ఫోన్ వాడుతున్న బఫెట్
- కేవలం ఫోన్ కాల్స్, మెసేజీల కోసం మాత్రమే వినియోగం
- ఇటీవలే ఐఫోన్ 11 వాడటం మొదలుపెట్టినట్టు వెల్లడి
ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఎట్టకేలకు స్మార్ట్ ఫోన్ వాడటం మొదలుపెట్టారు. దశాబ్దాలుగా తాను వాడుతున్న సామ్ సంగ్ ఫ్లిప్ ఫోన్ ను వదిలేసి.. ఐఫోన్ 11 వాడటం మొదలుపెట్టారు. చిత్రమేమిటంటే ఆయనకు యాపిల్ కంపెనీలో ఐదు శాతం వాటా కూడా ఉంది. 89 ఏళ్ల వయసున్న వారెన్ బఫెట్ ప్రపంచంలోనే నాలుగో అత్యంత ధనవంతుడు.
అయినా మామూలుగానే వాడుతున్నా..
ఫ్లిప్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ కు మారినట్టుగా ఆయన ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో చెప్పారు. ఐఫోన్ 11 వాడుతున్నానని చెప్పారు. అయితే స్మార్ట్ ఫోన్ కు మారినా.. దానిని సాధారణ ఫోన్ లా కాల్స్, మెసేజీల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. అయితే ఆయన ఇప్పటికే యాపిల్ ఐ ప్యాడ్ ను కూడా వాడుతున్నారు. కానీ దానిని కేవలం స్టాక్ మార్కెట్ ను చూసుకోవడం కోసమే వాడుతానని తెలిపారు.
సామ్ సంగ్ ఫ్లిప్ ఫోన్..
వారెన్ బఫెట్ చాలా ఏళ్లుగా సామ్ సంగ్ కు చెందిన ఫ్లిప్ ఫోన్ ను వినియోగిస్తున్నారు. అది సామ్ సంగ్ ఎస్ సీహెచ్–యూ320 మోడల్ ఫోన్. కేవలం 2జీ మాత్రమే పనిచేసే ఆ ఫోన్ నే ఆయన ఇటీవలి వరకు వినియోగించారు. ఈ మధ్యే యాపిల్ ఐఫోన్ కు మారారు. తనకు శాంసంగ్ ఫోన్ ను టెలిఫోన్ సృష్టికర్త అలెగ్జాండర్ గ్రాహంబెల్ స్వయంగా ఇచ్చారంటూ వారెన్ బఫెట్ చమత్కరించారు కూడా.
మళ్లీ ఫ్లిప్ ఫోన్లు వస్తున్న సమయంలో..
స్మార్ట్ ఫోన్లు రాక ముందటి సమయంలో ఫ్లిప్ ఫోన్లకు బాగా డిమాండ్ ఉండేది. అదో ఫ్యాషన్ గా కూడా చలామణి అయింది. మోటో రేజర్ ఫ్లిప్ ఫోన్ అయితే లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే ఇప్పుడు స్క్రీన్ ను మడతపెట్టుకునేలా స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. వాటిపై బాగా క్రేజ్ కనిపిస్తోంది. ఇన్నాళ్లూ సాధారణ ఫ్లిప్ ఫోన్ వాడిన బఫెట్.. ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లు వస్తున్న సమయంలో దానిని వదిలేశారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.