Cricket: అటు సెంచరీ.. ఇటు నాలుగు వికెట్లు.. చెలరేగిపోతున్న జూనియర్​ ద్రావిడ్​

Rahul Dravid Son Samit Follows Up Double Century With Splendid All Round Show

  • బ్యాటింగ్ తోపాటు బౌలింగ్ లోనూ సత్తా చూపుతున్న ద్రావిడ్ కుమారుడు సమిత్
  • అండర్ 14 బీటీఆర్ షీల్డ్ టోర్నీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఒక సెంచరీ, నాలుగు వికెట్లు పడగొట్టిన జూనియర్
  • ఇంతకుముందు మ్యాచ్ లో ఏకంగా డబుల్ సెంచరీ 

లెజెండరీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ తనయుడు సమిత్ ద్రావిడ్ క్రికెట్ లో తన సత్తా చూపుతున్నాడు. బ్యాటింగ్ లో మాత్రమే కాదు బౌలింగ్ లోనూ అదరగొడుతున్నాడు. ముంబైలో జరిగిన అండర్ 14 బీటీఆర్ షీల్డ్ టోర్నీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్ ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టు విద్యా షిల్ప్ అకాడమీ టీమ్ బౌలింగ్ ను చిత్తు చేస్తూ సెంచరీ చేయడంతోపాటు నాలుగు వికెట్లు కూడా పడగొట్టాడు.

131 బంతుల్లో 166 రన్స్

తొలుత మాల్యా స్కూల్ జట్టు బ్యాటింగ్ చేసింది. మొత్తం 50 ఓవర్లలో 330 పరుగులు చేసింది. ఇందులో సగం రన్స్ సమిత్ ద్రావిడ్ ఒక్కడే చేశాడు. 131 బంతుల్లో 24 బౌండరీలతో 166 పరుగులు చేశాడు. తోటి ప్లేయర్ అన్వయ్ 90 పరుగులతో అతడికి అండగా నిలిచాడు.

ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్ ను కూల్చి..

తర్వాత బ్యాటింగ్ కు దిగిన విద్యా షిల్ప్ అకాడమీ జట్టు 38.5 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌట్ అయింది. సమిత్ తన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్ప కూల్చాడు. కేవలం 35 రన్స్ ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ లో విజయంతో మాల్యా స్కూల్ జట్టు సెమీ ఫైనల్ కు చేరింది.

ఇదే టోర్నీలో డబుల్ సెంచరీ

సమిత్ ఇదే టోర్నీలో ఇంతకు ముందు జరిగిన మ్యాచ్ లో ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు. శ్రీకుమరన్ జట్టుపై 33 బౌండరీలతో 204 రన్స్ చేశాడు. గతేడాది జరిగిన అండర్ 14 రాష్ట్రస్థాయి టోర్నీ, జోనల్ టోర్నీల్లోనూ తన ప్రతిభ చూపాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News