Chandrababu: మద్యం ధరలు పెంచారు.. పక్క రాష్ట్రాల్లో సేల్స్ పెరిగాయి!: ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం
- మద్యం, విద్యుత్తు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచేశారు
- ఏపీలో మద్యం సేల్స్ తగ్గిపోతున్నాయి
- పెట్రోల్, డీజిల్ పరిస్థితి కూడా ఇంతే ఉంది
- రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలన్నిటినీ తీసేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన కుప్పంలో మీడియాతో మాట్లాడుతూ... 'మద్యం, విద్యుత్తు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచేశారు. మద్యం సేల్స్ తగ్గిపోయి పక్క రాష్ట్రాల్లో పెరిగే పరిస్థితి వచ్చింది. పెట్రోల్, డీజిల్ పరిస్థితి కూడా ఇంతే ఉంది. రాష్ట్ర ఆదాయం తగ్గిపోతోంది. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలన్నీ తీసేస్తున్నారు' అని విమర్శించారు.
'అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు నం.1 రాష్ట్రంగా ఉన్న ఏపీ ఇప్పుడు చిట్టచివరి రాష్ట్రం అయింది. రాష్ట్ర పరిస్థితిపై మీడియాలో రాస్తే ఎల్లో మీడియా రాసిందని అంటున్నారు. జాతీయ మీడియా కియా మోటార్స్ అనంతపురం నుంచి వెళ్లిపోతున్నట్లు రాసినా తెలుగు దేశం పార్టీయే కారణమని ఆరోపణలు చేస్తున్నారు. చచ్చినా ఏపీకి రామని చెబుతూ ఏపీ నుంచి పెట్టుబడి దారులు వెనక్కి వెళ్లిపోతున్నారు' అని చంద్రబాబు నాయుడు తెలిపారు.
చెత్త, నీచమైన ఆలోచనలతో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. ప్రజలు అమాయకులు కాదని, వారు అన్నీ గుర్తిస్తున్నారని చెప్పారు. ప్రజా చైతన్య యాత్రలో ప్రజలకు అన్ని విషయాలు వివరించి చెబుతున్నట్లు తెలిపారు.