Andhra Pradesh: వేలానికి ఏపీ ప్రజా వేదిక ఫర్నీచర్!

Praja Vedika furniture to be auctioned

  • ఎనిమిది నెలల క్రితం ప్రజా వేదిక కూల్చివేత
  • మిగిలిన సామగ్రిని వేలం వేయాలని నిర్ణయం
  • మార్చి 3వ తేదీ వరకు దరఖాస్తుల ఆహ్వానం
  • మార్చి 4న వేలం నిర్వహించాలని సీఆర్డీఏ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో క్యాంప్ కార్యాలయంగా ఉపయోగించుకున్న ప్రజా వేదిక మరోసారి వార్తల్లోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే అక్రమ కట్టడంగా గుర్తించి కూల్చివేసిన ప్రజా వేదికలో మిగిలిపోయిన ఫర్నీచర్‌‌ను వేలం వేయాలని సీఆర్‌‌డీఏ నిర్ణయించింది.

ఆసక్తి ఉన్న బిడ్డర్లు వచ్చే నెల మూడో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆ తర్వాతి రోజు వేలం నిర్వహిస్తామని ప్రకటించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ. 9 కోట్ల వ్యయంతో ప్రజా వేదికను నిర్మించారు. కానీ, సీఎం జగన్ ఆదేశాలతో గతేడాది జూన్‌లో దీన్ని కూల్చివేసిన సీఆర్డీఏ.. ఏసీలు, కుర్చీలు, టేబుళ్లు సహా పలు విలువైన వస్తువులను అక్కడే వదిలేసింది. ఇప్పుడు వాటిని వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించింది.

ఇప్పుడు పది శాతం కూడా రాదు: నక్కా ఆనంద్ బాబు

ప్రజా వేదికలో మిగిలిపోయిన సామగ్రిని వేలం వేయాలన్న నిర్ణయంపై టీడీపీ సీనియర్‌‌ నాయకుడు నక్కా ఆనంద్ బాబు స్పందించారు. అయితే, ప్రజా వేదిక కూల్చివేసిన ఎనిమిది నెలల తర్వాత అందులోని సామగ్రిని వేలం వేయడాన్ని తప్పుబట్టారు. కూల్చిన వెంటనే ఈ పని చేస్తే కొన్ని కోట్ల రూపాయలైనా వచ్చేవన్నారు. ఇప్పుడు అందులో పది శాతం కూడా రాదని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News