Rafi: 100 రోజుల్లోనే విచారణ... కామాంధుడికి చిత్తూరు కోర్టు ఉరిశిక్ష!
- నవంబర్ 6న పెళ్లికి వెళ్లిన ఐదేళ్ల బాలిక
- చాక్లెట్ ఆశ చూపించి అత్యాచారం, హత్య
- నిందితుడికి బతికే హక్కు లేదన్న న్యాయమూర్తి
చిత్తూరు జిల్లాలో అభం శుభం ఎరుగని చిన్నారిపై అత్యంత క్రూరంగా లైంగికదాడి చేసి, ఆపై దారుణంగా హత్య చేసిన కిరాతకుడు మహ్మద్ రఫీ (25)కి పోక్సో (లైంగిక దాడుల నుంచి చిన్న పిల్లల పరిరక్షణ) న్యాయస్థానం ఉరిశిక్షను విధించింది. ఈ కేసు విచారణ కేవలం 100 రోజుల్లోనే పూర్తి కావడం గమనార్హం. కేసును విచారించిన మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఎం వెంకట హరినాథ్, దోషికి శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో పోక్సో చట్టం కింద ఉరిశిక్ష ఇదే తొలిసారి. కేసు వివరాల్లోకి వెళితే, బి కొత్తకోటకు చెందిన ఐదేళ్ల చిన్నారి, కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీలో జరిగిన ఓ వివాహానికి నవంబర్ 7న తల్లిదండ్రులతో వచ్చింది. భోజనాల తరువాత ఆడుకుంటూ ఉండగా, మదనపల్లె ప్రాంతానికి చెందిన రఫీ, ఐస్ క్రీమ్ ఆశ చూపించి కల్యాణ మండపంలో ఉన్న బాత్ రూమ్ కు తీసుకెళ్లి, నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. ఆపై గొంతునులిమి చంపేశాడు. మృతదేహాన్ని కల్యాణ మండపం పక్కన పడేశాడు.
పాప కోసం రాత్రంతా గాలించిన తల్లిదండ్రులు, మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ప్రహరీ గోడ పక్కనున్న గుంతలో పాప మృతదేహం లభ్యమైంది. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు, నిందితుడి ఊహాచిత్రాన్ని రూపొందించి విచారించగా, రఫీ చేసిన ఘాతుకం బట్టబయలైంది. నవంబర్ 16న అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి, న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు.
ఈ కేసులో 72 పేజీల తీర్పును చదివిన న్యాయమూర్తి, శిక్ష వివరాలను హైకోర్టుకు పంపుతున్నామని, శిక్ష అమలు తేదీని హైకోర్టు ఖరారు చేస్తుందని న్యాయమూర్తి వెంకట హరినాథ్ తెలిపారు. తనకు తల్లిదండ్రులు, భార్య ఉన్నారని, కనికరం చూపాలని రఫీ చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేరం అత్యంత హేయమైన, క్రూరమైన చర్యని, దోషికి సమాజంలో బతికే హక్కు లేదని జడ్జి పేర్కొన్నారు.