YS Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలన్న కేసులో తీర్పు రిజర్వ్
- వైఎస్ వివేకా హత్య కేసుపై ముగిసిన విచారణ
- పోస్టుమార్టమ్ నివేదిక, కేసు డైరీని కోర్టుకు సమర్పించిన పోలీసులు
- సీబీఐ విచారణ అవసరం లేదన్న ప్రభుత్వ న్యాయవాది
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐతో విచారణ చేయించాలన్న కేసుపై విచారణ ముగిసింది. ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ఏపీ హైకోర్టు ప్రకటించింది. ఈ కేసు విచారణలో భాగంగా పోస్టుమార్టమ్ నివేదిక, జనరల్ కేసు డైరీని పోలీసులు కోర్టుకు సమర్పించారు. అయితే, వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని నాడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడాన్ని వివేకా కూతురు సునీత తరఫు న్యాయవాది తప్పుబట్టారు. ఈ విషయమై న్యాయమూర్తికి తమ అభ్యంతరం తెలిపారు.
వివేకా హత్య కేసులో విచారణ ముగింపు దశకు చేరుకుందని, సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్న తమ అభిప్రాయాన్ని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించిన సిట్ దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి అందజేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది.