Nara Lokesh: వైసీపీ కార్యకర్తలూ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు!: నారా లోకేశ్
- ‘నవరత్నాలు’ సంగతి దేవుడెరుగు
- అంతకన్నా ముందుగా తాగునీరు, సాగునీటి కష్టాలు తీర్చండి
- పరిస్థితి చూస్తుంటే రెండు నెలల ముందుగానే వేసవి వచ్చినట్టుంది
ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తాజా విమర్శలు చేశారు. రాష్ట్రంలో తాగునీటి కోసం ప్రజలు, సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. వైసీపీ అమలు చేస్తామన్న ‘నవరత్నాలు’ అమలు చేస్తారో లేదో దేవుడికే తెలియాలని, అంతకన్నా ముందుగా నీటి కష్టాలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారంటూ లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు. రికార్డు స్థాయిలో వరదలు వచ్చినా, నీటిని ఒడిసి పట్టుకోవాల్సిన ప్రభుత్వం, చంద్రబాబు ఇంటిని ముంచేందుకు ఆ నీటిని దిగువ ప్రాంతానికి వదిలేశారని ఘాటు విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా ప్రజల నీటి కష్టాలకు సంబంధించి ఆయా పత్రికల్లో వచ్చిన కథనాల ప్రతులను పోస్ట్ చేశారు. మంత్రి జయరాం మండలంలో కూడా సాగు, తాగునీటి సమస్యలు ఉన్నాయని స్వయంగా వైసీపీ సభ్యులే విమర్శలు చేస్తూ వచ్చిన ఓ కథనం తాలూకు ప్రతినీ లోకేశ్ జతపరిచారు.
అటు తెలంగాణా నీటిని సద్వినియోగం చేసుకుంటే, మన రాష్ట్రం మాత్రం సముద్రంలోకి వదలడం, దీనికి తోడు ముందు చూపు లేని పాలకులు కూడా తోడయ్యారంటూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అలక్ష్యం కారణంగా వేసవికాలం రాకముందే తాగునీటి కోసం ఆందోళనలు చెయ్యాల్సిన పరిస్థితులు తలెత్తాయని మండిపడ్డారు.