Galla Jayadev: కారుతో ఢీకొట్టి పట్టించుకోకుండా వెళ్లిపోతారా?: గల్లా జయదేవ్
- ఎంపీ సురేశ్ కాన్వాయ్ లోని వాహనం తగిలి రైతుకు గాయాలు
- ఓ ప్రజాప్రతినిధి కులం అడ్డంపెట్టుకుని రెచ్చిపోతున్నాడంటూ వ్యాఖ్యలు
- అమరావతికి మద్దతు కోరితే ఎస్సీ అట్రాసిటీ కేసులా? అంటూ ఆగ్రహం
బాపట్ల ఎంపీ, వైసీపీ యువనేత నందిగం సురేశ్ కాన్వాయ్ లోని ఓ వాహనం అమరావతి రైతును ఢీకొట్టిన ఘటనపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. ఓ ర్యాలీ జరుగుతున్న సమయంలో తన కాన్వాయ్ లోని వాహనం తగిలి ఓ రైతు గాయపడితే కనీసం కారు ఆపకుండా వెళ్లిపోతారా అంటూ మండిపడ్డారు. కారుతో ఢీకొట్టి వెళ్లిపోయినందుకు బాధపడాలంటూ పేర్కొన్నారు. ఓ ప్రజాప్రతినిధి అయ్యుండి కులాన్ని అడ్డంపెట్టుకుని హింసను ప్రేరేపిస్తున్నందుకు సిగ్గుపడాలని ట్వీట్ చేశారు. పువ్వులు అందించి జై అమరావతి అనాలని కోరిన ప్రజలపై ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని గల్లా జయదేవ్ ఆరోపించారు. ఎన్నికల ముందు రైతుల పంటలు తగలబెట్టడం నుంచి నిన్న మహిళా జేఏసీ నేతలపై దాడుల వరకు హింస నిరాటంకంగా కొనసాగుతోందని వ్యాఖ్యానించారు.