Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఇండియా టూర్ ఫైనల్ షెడ్యూల్ ఇదే!

Trump India tour schedule

  • రేపు ఉదయం 11.55 గంటలకు ల్యాండింగ్
  • అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీల్లో పర్యటన
  • మంగళవారం రాత్రి 10 గంటలకు టేకాఫ్

సోమవారం నుంచి రెండు రోజుల పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియా, కుమార్తె ఇవాంకలతో కలిసి భారత్ లో పర్యటించనున్నారన్న సంగతి తెలిసిందే. ట్రంప్ పర్యటనకు సంబంధించిన తుది షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది.

రేపు ఉదయం 11.55 గంటలకు ట్రంప్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ వన్ విమానం అహ్మదాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటుంది. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర ప్రొటోకాల్ అధికారులు స్వాగతం పలుకుతారు.

ఆపై ఎయిర్ పోర్టు నుంచి మొతెరా స్టేడియం వరకు భారీ ర్యాలీ జరుగుతుంది. మోదీ, ట్రంప్ పాల్గొనే ఈ ర్యాలీ 22 కిలోమీటర్ల దూరం సాగుతుంది. మధ్యాహ్నం 12.30కి మొతెరా స్టేడియంలో 'నమస్తే ట్రంప్‌' కార్యక్రమంలో భాగంగా ఇరు దేశాధి నేతలూ ప్రసంగిస్తారు. ఆపై సబర్మతీ ఆశ్రమం సందర్శన అనంతరం మధ్యాహ్నం 3.30కి ట్రంప్ టీమ్ ఆగ్రా బయలుదేరుతుంది.

సాయంత్రం 5.10కి తాజ్‌మహల్‌ ను సందర్శించనున్న ట్రంప్, రాత్రి 7.30 గంటలకు న్యూఢిల్లీలోని పాలెం ఎయిర్‌ పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి లగ్జరీ హోటల్ మౌర్యకు వెళ్లి రాత్రికి బస చేస్తారు. మరుసటి రోజు... అంటే మంగళవారం ఉదయం 9.55 గంటలకు రాష్ట్రపతి భవన్‌ చేరుకుని గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, 10.45కు రాజ్‌ ఘాట్‌ లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద నివాళులు అర్పిస్తారు.

ఉదయం 11.25 గంటలకు హైదరాబాద్‌ హౌస్‌ కు చేరుకునే నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ లు ఉమ్మడి మీడియా సమావేశంలో పాల్గొని, ఆపై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం ట్రంప్‌, మోదీ లంచ్ మీటింగ్ ఉంటుంది.

లంచ్ తరువాత మధ్యాహ్నం 2.55 గంటలకు అమెరికా ఎంబసీలో తమ దేశ సిబ్బందితో భేటీ అయ్యే ట్రంప్, కాసేపు విశ్రాంతి అనంతరం రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రామ్ నాథ్ కోవింద్ ఇచ్చే గౌరవ విందుకు హాజరవుతారు. ఈ కార్యక్రమానికి దాదాపు 150 మందికి పైగా అతిథులు హాజరవుతారని తెలుస్తోంది. విందు అనంతరం రాత్రి 10 గంటలకు తాను వచ్చిన ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోనే ట్రంప్ జర్మనీ మీదుగా అమెరికాకు బయలుదేరుతారు.

Donald Trump
India
Tour
Schedule
  • Loading...

More Telugu News