New Delhi: పోలీసుల దాడిలో చూపు పోయింది... రెండు నెలల తరువాత అవార్డు పొందిన ఢిల్లీ విద్యార్థి!
- గత సంవత్సరం డిసెంబర్ లో నిరసనలు
- సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలపై లాఠీ చార్జ్
- కంటి చూపును కోల్పోయిన మిన్హాజుద్దీన్
గత సంవత్సరం డిసెంబర్ 15న న్యూఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద జరిగిన సీఏఏ ఆందోళనల్లో కంటి చూపును పోగొట్టుకున్న మహమ్మద్ మిన్హాజుద్దీన్ అనే విద్యార్థికి, జామియా టీచర్స్ అసోసియేషన్ అవార్డు లభించింది. నాడు సీఏఏకు నిరసనగా మిన్హాజుద్దీన్ ఆందోళనల్లో పాల్గొనగా, పోలీసులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. అతని ఎడమకంటికి లాఠీ దెబ్బ బలంగా తగలగా, దాని కారణంగా అతని చూపు పోయింది. వైద్యులు సైతం శాశ్వతంగా చూపు రాదని నిర్దారించారు.
అయితే, అంతకుముందే మానవ హక్కులపై అతను రాసిన వ్యాసానికి, చూపు పోయిన తరువాత మెరుగులు దిద్ది వర్శిటీకి సమర్పించాడు. దీన్ని పరిశీలించిన వర్శిటీ కమిటీ, రెండు నెలల తరువాత ఫలితాలను ప్రకటిస్తూ, మిన్హాజుద్దీన్ వ్యాసాన్ని ఉత్తమమైనదిగా నిర్ణయించింది. ప్రస్తుతం అవార్డు పొందినందుకు పొంగిపోకుండా, ఆ చట్టానికి నిరసనగా ఆందోళన చేస్తే, తనకు చూపు పోయేంతటి నష్టం జరగడంపై మనో వేదనతో ఉన్నాడు. తాను ఏం తప్పు చేశానని ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు.