Kolkata: ప్రియుడు ఎప్పటికైనా రాడా... మూడు నెలలుగా ఒకే చోట వేచి చూస్తున్న యువతి!

Kolkata Girl waiting for lover in karnataka

  • కర్ణాటక యువకుడిని ప్రేమించిన కోల్ కతా యువతి
  • తీసుకుని వచ్చి ఓ ఇంట్లో కొన్ని రోజులు ఉంచిన యువకుడు
  • ఆపై నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిన వైనం
  • వివరాలు సేకరిస్తున్న పోలీసులు

ఆ యువతి పేరు హసీనా... పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా ఆమె నివాసం. ఎలా పరిచయమయ్యాడో, ఏమోగానీ... ఆమెను నమ్మించిన ఓ యువకుడు కర్ణాటకకు తీసుకుని వచ్చాడు. రాష్ట్రం కాని రాష్ట్రం తీసుకువచ్చిన ప్రియుడు, అర్ధాంతరంగా వదిలి వెళ్లిపోగా, ఎప్పటికయినా, తాను ప్రేమించిన యువకుడు వస్తాడన్న ఆశతో, మూడు నెలలుగా ఆమె ఆ ప్రాంతంలోనే వేచి చూస్తోంది.

ఈ ఘటన దేవనహళ్లి తాలూకా కారళ్లిలో వెలుగులోకి రాగా, కాస్తంత ఆలస్యంగా మీడియా స్పందించడంతో విషయం నలుగురికీ తెలిసింది. గత మూడు నెలలుగా ఆ యువతి బేకరిలు, దుకాణాలు, బస్టాండు సమీపంలో తిరుగుతూ, రాత్రి సమయంలో రోడ్లపై పడుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. తొలుత ఆమెను గమనించిన స్థానికులు మానసిక వ్యాధిగ్రస్థురాలిగా భావించారు.

కొందరు ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించగా, అసలు విషయం బయట పడింది. ఆమె విషాద ప్రేమ కథ అందరికీ తెలిసింది. హసీనాకు కన్నడ భాష రాకపోవడంతో, హిందీ తెలిసిన కొందరు ఆమె వివరాలను తెలుసుకున్నారు. తనను ప్రేమించిన అజయ్ అనే యువకుడు ఇక్కడికి తీసుకుని వచ్చాడని, కారళ్లిలో కొన్ని రోజులు ఓ ఇంట్లో ఉంచాడని ఆమె అంటోంది. ఆపై కోల్‌ కతా వెళదామని చెప్పగా, తాము బయలుదేరామని, మధ్యలో అతను వదిలేసి వెళ్లాడని వాపోయింది.

తన ప్రియుడిపై నమ్మకం ఉందని, ఎప్పటికైనా వస్తాడని హసీనా చెబుతుంటే, ఆమె గుడ్డి ప్రేమకు జాలిపడ్డ స్థానికులు, విషయాన్ని పోలీసులకు చేరవేశారు. పోలీసులు హసీనాను మహిళా సాంత్వన కేంద్రానికి తరలించి రక్షణ కల్పించారు. ప్రస్తుతం ఆమె మానసికంగా కుంగిపోయిందని, చికిత్స చేయిస్తున్నామని, ఆపై ఆమె ఆనవాలు కనుక్కొని, కోల్ కతాకు పంపుతామని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News