Bonda Uma: జగన్ ను ఆ దేశానికి అప్పగించే పరిస్థితి ఉంది: బోండా ఉమ
- రస్ అలై ఖైమా కేసు నుంచి దృష్టిని మరల్చేందుకే సిట్ వేశారు
- విశాఖలో రాజధాని ఏర్పాటుపై నేవీ అభ్యంతరం తెలిపింది
- రాజధాని విశాఖ అంటూ హడావుడి చేసినవారంతా ఇప్పుడేం చెపుతారు?
విశాఖలో రాజధాని ఏర్పాటుపై ఇండియన్ నేవీ అధికారులు అభ్యంతరం తెలిపారని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. దీంతో, విశాఖ విషయంలో ముఖ్యమంత్రి జగన్ వెనక్కి తగ్గారని చెప్పారు. నేవీకి అత్యంత కీలకప్రాంతంలో ఉన్న మిలీనియం టవర్స్ లో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెట్టడానికి వీల్లేదని నేవీ అధికారులు స్పష్టం చేశారని... ఇదే విషయాన్ని ఓ జాతీయ పత్రిక సైతం ప్రచురించిందని తెలిపారు. నేవీ దెబ్బకు వైసీపీ నేతలు మౌనంగా ఉండిపోయారని చెప్పారు. రాజధాని విశాఖ అంటూ హడావుడి చేసినవారంతా ఇప్పుడేం చెపుతారని ప్రశ్నించారు. సచివాలయాన్ని వైజాగ్ లో ఎక్కడ పెడతారని ఎద్దేవా చేశారు. 9 నెలల్లోనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు.
విశాఖలో కబ్జా చేసిన భూములపైనా, జేట్యాక్స్ పైనా సిట్ తో విచారణ జరిపించాలని ఉమ డిమాండ్ చేశారు. తాడేపల్లిలో ఇండెంట్ సిద్ధం చేస్తుంటే, హైదరాబాదులో పేమెంట్ చేస్తున్నారని ఆరోపించారు. దోచుకున్న రూ. 20 వేల కోట్లపై కూడా సిట్ వేయాలని అన్నారు. అమరావతిలో ఇన్సైడర్ ఆరోపణలపై వేసిన సిట్ కు తాము భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. రస్ అల్ ఖైమా కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సిట్ వేశారని అన్నారు. రస్ అల్ ఖైమాకు రూ. 800 కోట్లను చెల్లించేందుకు తన ఎంపీలను జగన్ ఆ దేశానికి పంపించారని ఆరోపించారు. నేరస్తుల అప్పగింత ఒప్పందంలో భాగంగా జగన్ ను ఆ దేశానికి అప్పగించే పరిస్థితి ఉందని చెప్పారు.