- రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడి
- గుడి ఎత్తు 125 ఫీట్ల నుంచి 160 ఫీట్లకు పెంపు
- అదనంగా మూడో అంతస్తు నిర్మాణం
- నిపుణులతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఆరు నెలల్లోగా ప్రారంభమవుతుందని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. ఈ ఆలయం కోసం విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) గతంలోనే రూపొందించిన మోడల్ కు కొన్ని మార్పులు చేసి నిర్మిస్తామని వెల్లడించింది. దీనికి సంబంధించి అయోధ్య లోని అఖాడాలను సంప్రదిస్తామని, నిపుణులతోనూ చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది.
ఆలయం ఎత్తు పెంపు..
వీహెచ్ పీ రూపొందించిన మోడల్ లో రామాలయాన్ని 125 అడుగుల ఎత్తుతో కట్టాలని ప్రతిపాదించారు. ఇప్పటికే చాలా వేదికల్లో ఈ మోడల్ ను ప్రదర్శించారు. ఎప్పటికైనా అదే మోడల్ లో రామ మందిరం నిర్మాణం జరుగుతుందని కూడా చెబుతూ వచ్చింది. అయితే ఆ మోడల్ లో కొన్ని మార్పులు చేయాలని ట్రస్టు నిర్ణయించింది. ఎత్తు 160 అడుగులకు పెంచాలని, అదనంగా మూడో అంతస్తు కూడా నిర్మించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ట్రస్టు సభ్యులు గురువారమే కన్ స్ట్రక్షన్ కమిటీ హెడ్ నృపేంద్ర మిశ్రాను కలిసి చర్చించారు. నిపుణులతో పాటు వివిధ గ్రూపులను సంప్రదించి, అందరికీ ఆమోదయోగ్యమైన మోడల్ ను ఎంపిక చేస్తామని తెలిపారు.
ఆలయ నిర్మాణంలో వివాదాలు వద్దన్న మోదీ
రామ మందిరం నిర్మాణ పనులు శాంతియుతంగా, ఎలాంటి గొడవలు లేకుండా జరగాలని ప్రధాని మోదీ చెప్పారని ట్రస్టు సభ్యుడు చంపత్ రాయ్ తెలిపారు. గురువారం ప్రధాని మోదీని కలిసిన సందర్భంగా తమకు పలు సూచనలు చేశారని వెల్లడించారు. శాంతియుతంగా పనులు జరిగేలా చూడాలని కోరారని తెలిపారు.