Chandrababu: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. చంద్రబాబు ఐదేళ్ల పాలనపై విచారణకు ‘సిట్’ ఏర్పాటు

AP Govt sensational decision

  • చంద్రబాబు పాలనలో అవినీతి జరిగిందంటూ మంత్రివర్గ ఉపసంఘం నివేదిక
  • అందులోని అంశాలపై విచారణ కోసం పదిమంది బృందంతో సిట్ ఏర్పాటు
  • నిఘా విభాగం డీఐజీ కొల్లి రఘురాంరెడ్డి నేతృత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కోసం నిఘా విభాగం డీఐజీ కొల్లి రఘురాంరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, పథకాలు, ఏర్పాటు చేసిన సంస్థలు (కార్పొరేషన్లు, సొసైటీలు, కంపెనీలు మొదలగునవి) వంటి వాటితోపాటు పాలనాపరమైన అనుమతులపై సమీక్షించడానికి గతేడాది జూన్ 26న మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది.

తాజాగా, ఈ  కమిటీ సమర్పించిన నివేదికలో బాబు ఐదేళ్ల పాలనలో అక్రమాలు జరిగాయని పేర్కొంది. సీఆర్‌డీఏ పరిధిలో భూముల కేటాయింపుతోపాటు పలు ప్రాజెక్టుల్లో విధాన, న్యాయపరమైన అవకతవకలు, మోసపూరిత లావాదేవీలను మంత్రివర్గ ఉపసంఘం గుర్తించిందని, కాబట్టి ఈ మొత్తం వ్యవహారంపై సిట్‌తో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు నిన్న రాత్రి ఓ జీవోను విడుదల చేసింది.

ఇందుకోసం నిఘా విభాగం డీఐజీ కొల్లి రఘురాంరెడ్డి నేతృత్వంలో ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఇందులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు, ఒక అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. దర్యాప్తు చేస్తున్న అంశానికి సంబంధించి ఏ వ్యక్తినైనా, అధికారినైనా పిలిపించి వాంగ్మూలం రికార్డు చేసుకునే అధికారం సిట్‌కు ఉందని జీవోలో పేర్కొంది.

Chandrababu
SIT
YS Jagan
Andhra Pradesh
Amaravati
  • Loading...

More Telugu News