Atchanaidu: ఈఎస్​ఐ అవకతవకల్లో నా పాత్ర ఉందన్న దుష్ప్రచారం తగదు: అచ్చెన్నాయుడు

 Atchanaidu rebukes ESI scam propaganda

  • వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు
  •  దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా
  •  ఓ వర్గం మీడియా దురుద్దేశంతోనే నాపై అసత్య ప్రచారం 

ఏపీలో గత ప్రభుత్వం హయాంలో కార్మిక బీమా సంస్థ (ఈఎస్ఐ) స్కామ్ లో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు పాత్ర ఉందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,  కావాలనే తనపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. టెలీ హెల్త్ సర్వీసెస్ ఏర్పాటు అనేది తాను ఏపీ కార్మిక శాఖా మంత్రిగా ఉన్నప్పుడు, కేంద్రం ఆదేశాల మేరకు తీసుకున్న నిర్ణయమని చెప్పారు.

ఏపీ కంటే ముందుగా తెలంగాణలో దీనిని ప్రారంభించారని, తెలంగాణలో మాదిరిగానే ఏపీలోనూ అమలు చేయాలని నోట్ పంపానని, వ్యక్తిగతంగా ఏ ఒక్కరికో దీనిని కేటాయించాలని ఆదేశించలేదని నాటి విషయాలను గుర్తుచేసుకున్నారు. ఓ వర్గం మీడియా దురుద్దేశంతోనే తనపై అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని, రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన నాటి రికార్డులు తన దగ్గర ఉన్నాయని చెప్పిన అచ్చెన్నాయుడు.. ఓ ప్రతిని విలేకరుల సమావేశంలో చూపించారు. కాగా, ఈఎస్ఐలో అవకతవకలపై ప్రభుత్వానికి అధికారులు నివేదిక సమర్పించనున్నారు.

  • Loading...

More Telugu News