America: భారత పర్యటనలో ట్రంప్ ఎప్పుడెప్పుడు, ఏమేం చేస్తారంటే..!
- అమెరికా అధ్యక్షుడి టూర్ షెడ్యూల్ ఖరారు
- రెండు రోజులు భారత్ లో ఉండనున్న ట్రంప్
- భార్య మెలానియాతో కలిసి ఢిల్లీ, ఆగ్రా, అహ్మదాబాద్ సందర్శన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలిసారి మన దేశానికి రానున్న ట్రంప్ ఇక్కడ ఏం చేస్తారో.. ఏ ప్రదేశాలను సందర్శిస్తారో అన్నదానిపై చర్చ జరుగుతోంది. తన భార్య మెలానియాతో కలిసి ట్రంప్ ఈ నెల 24, 25వ తేదీల్లో భారత్ లో పర్యటిస్తున్నారు. మొత్తం మూడు దశల్లో అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీని ట్రంప్ దంపతులు సందర్శించనున్నారు.
మోదీతో ఐదోసారి సమావేశం
గడచిన ఎనిమిది నెలల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్ ఐదోసారి భేటీ కానున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్ మొతెరా గ్రౌండ్ లో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి వీరిద్దరు హాజరుకాన్నారు. గతేడాది టెక్సాస్ లో జరిగిన హౌడీ మోదీ తరహాలో జరిగే ఈ కార్యక్రమం ట్రంప్ టూర్ కు హైలైట్ గా మారనుంది. ఇక ట్రంప్ రెండు రోజుల పర్యటన ఎలా సాగుతుందంటే..- ఈ నెల 24న ఉదయం 11 గంటలకు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ అహ్మదాబాద్ కు చేరుకుంటారు. ట్రంప్ దంపతులకు ప్రధాని మోదీ స్వయంగా ఆహ్వానం పలుకుతారు.
- అనంతరం మోదీ, ట్రంప్.. రోడ్ షో ద్వారా మొతెరా స్టేడియం చేరుకుంటారు. మధ్యలో సబర్మతి ఆశ్రమం వద్ద ఆగి..15 నిమిషాలు అక్కడ గడుపుతారు.
- అమెరికా ప్రెసిడెంట్ కు ఆహ్వానం పలుకుతూ లక్షా పది వేల సీటింగ్ కెపాసిటీతో ఆధునికీకరించిన మొతెరా స్టేడియంలో జరిగే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి ఇరువురు నేతలు మధ్యాహ్నం 12.30 గంటలకు హాజరవుతారు. ఇద్దరు నేతలు కలిసి ప్రసంగిస్తారు.
- అదే రోజు మ. 3.30 గంటలకు ట్రంప్, మెలానియా ఆగ్రా బయల్దేరుతారు. సాయంత్రం 5 గంటలకు అగ్రా చేరుకుంటారు. రాత్రి ఢిల్లీకి వచ్చి ఐటీసీ మౌర్యా హోటల్లో బస చేస్తారు.
- ఈనెల 25న ట్రంప్ దంపతులు రాష్ట్రపతి భవన్ ను సందర్శిస్తారు. ఉదయం పది గంటలకు వీరిద్దరికీ అధికారిక ఆహ్వానం ఉంటుంది.
- అనంతరం ఉదయం 10.45కు ట్రంప్, మెలానియా రాజ్ ఘాట్ కు చేరుకుంటారు. అక్కడ మోదీతో కలిసి మహాత్మాగాంధీకి నివాళులు అర్పిస్తారు. సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాసిన తర్వాత ట్రంప్.. హైదరాబాద్ హౌజ్ కు బయల్దేరుతారు.
- హైదరాబాద్ హౌజ్ లో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మోదీ, ట్రంప్ మధ్య అత్యున్నత స్థాయి చర్చలు జరుగుతాయి. వివిధ అంశాల్లో రెండు దేశాల మధ్య ఒప్పంద పత్రాలపై సంతకం చేసి, ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడుతారు. చివరగా యూఎస్ ఎంబసీలో ఈసీఓ రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది.
- అనంతరం ప్రధాని మోదీ ఏర్పాటు చేసే లంచ్ లో ట్రంప్ దంపతులు పాల్గొంటారు. అక్కడి నుంచి ట్రంప్ ఐటీసీ మౌర్య హోటల్ చేరుకొని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసే అవకాశం ఉంది.
- అదే రోజు రాత్రి రాష్ట్రపతి భవన్ లో రామ్ నాథ్ కోవింద్ ఇచ్చే విందులో పాల్గొంటారు. అనంతరం 10 గంటలకు ట్రంప్, మెలానియా ప్రత్యేక విమానంలో అమెరికాకు తిరుగు ప్రయాణమవుతారు.