Gold: రూ. 4 వేలకు గ్రాము బంగారం ధర... స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ. 43 వేల పైనే!

Gold Rate at All time High

  • ఆల్ టైమ్ రికార్డుకు బంగారం ధరలు 
  • పెరిగిన పాత బంగారం విక్రయాలు
  • ఇదే అదనుగా వ్యాపారుల లాభాపేక్ష

బంగారం ధర గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి పెరిగి ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 43 వేలను అధిగమించగా, ఆభరణాల బంగారం ధర (22 క్యారెట్లు )రూ. 39,800గా నమోదైంది. బంగారం ధరలు భారీగా పెరగడంతో, పాత బంగారాన్ని విక్రయించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

కరోనా వైరస్ భయాలు, అంతర్జాతీయ స్థాయిలో వృద్ధి రేటు మందగమనం తదితరాల కారణంగా బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఓౌన్సు బంగారం ధర ఏకంగా 1,618 డాలర్లకు చేరింది. గత కొంత కాలం వరకూ 1,550 డాలర్ల వద్ద ఉన్న ఔన్సు ధర, డాలర్ విలువ పెరగడంతో పాటు, ఇతర కారణాల వల్ల మరో 70 డాలర్లు పెరిగింది.

ఇక దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర అర లక్షకు చేరువైంది. నిన్న ఎంసీఎక్స్ (మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్)లో వెండి ధర రూ. 49 వేలుగా నమోదైంది. ఇక ధరలు అధికంగా ఉండటంతో పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ, అమ్మకాలు సంతృప్తికరంగా సాగడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. ప్రస్తుత ధరలతో కొనుగోలుదారులు బెంబేలెత్తి పోతున్నారని తెలిపారు. ఇదిలావుండగా, కొత్త ఆభరణాలను కొనుగోలు చేసేందుకు వచ్చే వారిలో అత్యధికులు, పాత బంగారాన్ని మార్చుకుంటూ ఉండటంతో, ఇదే అదనుగా, గ్రాముకు రూ. 140 వరకూ తగ్గించి కొంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో తమకు నష్టం వస్తోందని ప్రజలు అంటున్నారు.

  • Loading...

More Telugu News