Team India: టెస్టు సమరానికి సిద్ధమైన టీమిండియా, న్యూజిలాండ్
- శుక్రవారం నుంచి తొలి టెస్టు
- వేదికగా నిలుస్తున్న వెల్లింగ్టన్ బేసిన్ రిజర్వ్
- సత్తా చాటేందుకు తహతహలాడుతున్న కీలక ఆటగాళ్లు
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ శుక్రవారం ప్రారంభం కానుంది. తొలి టెస్టుకు వెల్లింగ్టన్ లోని బేసిన్ రిజర్వ్ స్టేడియం వేదికగా నిలవనుంది. టెస్టు చాంపియన్ షిప్ ప్రారంభమైనప్పటి నుంచి ఓటమి ఎరుగకుండా విజయప్రస్థానం కొనసాగిస్తున్న టీమిండియాకు ఈసారి కివీస్ రూపంలో కఠినమైన ప్రత్యర్థి ఎదురుకావొచ్చని భావిస్తున్నారు. సుదీర్ఘమైన న్యూజిలాండ్ పర్యటనలో భారత్ మొదట టి20 సిరీస్ గెల్చుకోగా, ఆ తర్వాత న్యూజిలాండ్ వన్డేల్లో అదరగొట్టింది. దాంతో టెస్టు సిరీస్ రసవత్తరంగా సాగుతుందన్న అంచనాలు ఏర్పడ్డాయి.
తొలి టెస్టు కోసం టీమిండియా పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. ప్రాక్టీసు మ్యాచ్ లో అటు బౌలర్లు, ఇటు బ్యాట్స్ మెన్ రాణించడం సానుకూలాంశం. రేపట్నించి జరిగే మ్యాచ్ లో ఇషాంత్, ఉమేశ్ లలో ఒకరికి చోటు లభించే అవకాశం ఉంది. షమీ, బుమ్రాలకు తుదిజట్టులో చోటు ఖాయం. స్పిన్నర్ కోటాలో అశ్విన్ స్థానానికి ఢోకా లేదు.
ఇక ఆతిథ్య జట్టు విషయానికొస్తే, సీనియర్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ పునరాగమనం చేయడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. భారత సంతతి స్పిన్నర్ అజాజ్ పటేల్ ఈ మ్యాచ్ లో ఆడే అవకాశాలున్నాయి. ఇటీవల వన్డేల ద్వారా అరంగేట్రం చేసిన పొడగరి పేస్ బౌలర్ కైల్ జేమీసన్ టెస్టుల్లోనూ తన సత్తా చాటేందుకు తహతహలాడుతున్నాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా పూర్తి ఫిట్ నెస్ సంతరించుకోవడంతో కివీస్ జట్టు బలంగా కనిపిస్తోంది.