Pawan Kalyan: రైతులపై కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలి: పవన్ కల్యాణ్ డిమాండ్

Pawan Kalyan demands to lift cases upon Amaravathi farmers

  • క్రిష్ణాయపాలెంలో రెవెన్యూ అధికారులను అడ్డుకున్న రైతులు
  • 426 మంది రైతులపై కేసులు నమోదు
  • కేసుల నమోదు పుండుపై కారం చల్లినట్టుగా ఉందన్న పవన్

రాజధాని రైతులపై నమోదు చేసిన కేసులు తక్షణమే వెనక్కి తీసుకోవాలని జనసేనాని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. క్రిష్ణాయపాలెంలో రెవెన్యూ అధికారుల రాకను నిరసిస్తూ వ్యతిరేకత వ్యక్తం చేసిన 426 మంది రైతులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ స్పందించారు. రైతులపై కేసులు పెట్టడం ద్వారా ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూములను పంపిణీ చేస్తుంటే రైతులు అడ్డుకున్నారని, వాళ్ల భవిష్యత్తుకు భరోసా లేదని భావించి నిరసన వ్యక్తం చేశారని వివరించారు.

ఓవైపు మూడు రాజధానుల నిర్ణయంతో రాజధాని రైతుల పరిస్థితి అగమ్యగోచరంలా మారితే, ఇప్పుడు భూముల పంపిణీ నిర్ణయం, వారిపై కేసులు నమోదు చేయడం పుండుపై కారం చల్లినట్టుగా ఉందని పవన్ మండిపడ్డారు. తొలిరోజు నుంచి రైతులు శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నారని, కానీ ప్రభుత్వం వారితో ఎలాంటి చర్చలు జరపకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాజధాని కోసం దీక్షలు చేపడుతున్న రైతులకు జనసేన పార్టీ మద్దతుగా నిలుస్తుందని ఓ ప్రకటనలో వెల్లడించారు.

Pawan Kalyan
Farmers
PoliceCases
AP Capital
Amaravati
Janasena
  • Loading...

More Telugu News