Pawan Kalyan: అప్పుడు కుదరలేదు.. ఇప్పుడొచ్చి ఇచ్చాను: పవన్ కల్యాణ్
- కేంద్రీయ సైనిక్ బోర్డుకు చెక్ అందజేత
- ప్రతి ఒక్కరు సైనిక బోర్డుకు తమ వంతు సాయాన్ని అందించాలి
- నేతలను ఎవరినైనా కలుస్తానా? అన్న విషయం చెప్పలేను.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించి, అమర సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి కోటి రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ''ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే' సందర్భంగా సైనికులకు ఏం చేయగలనని అనుకున్నాను. కోటి రూపాయలు విరాళంగా ఇద్దామని అనుకున్నాను. ఇటీవల కొన్నిసార్లు ఢిల్లీకి వచ్చినప్పుడు ఆ మొత్తాన్ని ఇద్దామనుకున్నాను. అయితే అప్పుడు కుదరలేదు.. ఇప్పుడొచ్చి ఇచ్చాను. జనసేన నేతలు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరు సైనిక బోర్డుకు తమ వంతు సాయాన్ని అందించాలి' అన్నారు.
'ఢిల్లీలో రాజకీయ నేతలను ఎవరినైనా కలుస్తానా? లేదా? అన్న విషయంపై ఏమీ చెప్పలేను.. నిర్ణయం తీసుకోలేదు' అని చెప్పారు. ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పాల్గొనాలని తనకు ఆహ్వానమందిందని తెలిపారు. కాగా, కాసేపట్లో విజ్ఞాన్ భవన్‌కు వెళ్లి ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు ఆయనతో పాటు పలువురు ప్రముఖులు సమాధానమిస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారు.