Hyderabad: ఎవరు పడితే వారు నివసించడానికి భారత్ ధర్మసత్రం కాదు: బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి
- హైదరాబాద్ లో జరిగిన ఏబీవీపీ కార్యక్రమంలో ప్రసంగం
- ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రవేశించే వారిని శరణార్థులనరు
- అయినా సీఏఏ అంటే ముస్లింలకే ఎందుకు భయం
ఎవరు పడితే వారు దేశంలోకి చొరబడి యథేచ్చగా నివసించడానికి భారతదేశం ఏమీ ధర్మసత్రం కాదని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐరాస నిబంధనల ప్రకారం కూడా ఆర్థిక ప్రయోజనాల కోసం ఏ దేశంలోకైనా ప్రవేశించే వారిని శరణార్థులుగా పరిగణించరని గుర్తు చేశారు. రోహింగ్యాలు పాకిస్థాన్‌ను తమ దేశంగా పేర్కొంటూ 1944లో జిన్నా హయాంలోనే సంతకాలు చేశారని, అటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశ పౌరులుగా గుర్తించరని స్పష్టం చేశారు. నిన్న హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
సీఏఏను వ్యతిరేకిస్తున్న వారు ఏ కారణంతో వ్యతిరేకిస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. అయినా సీఏఏ చట్టం చూసి దేశంలోని ఇతర మతాల వారెవ్వరూ భయపడడం లేదని, ముస్లింలే ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని స్వామి ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వం గురించి చెబుతోందంటున్న నయా మేధావులు ఈ సమానత్వం పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్లలో ఉందా? అని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.
ఆయాదేశాల్లో మైనార్టీలను దేశ ప్రజలతో సమానంగా చూడరని, కానీ భారత్ లో సమానంగా గౌరవిస్తారని తెలిపారు. అయినా సీఏఏ చట్టం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హయాంలో చేసిందని, అప్పుడు వారు అసంపూర్తిగా వదిలేసిన కొన్ని అంశాలను ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపారు.
కాగా, సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతున్నంత సేపు వేదిక వద్ద కొందరు సీఏఏకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి తమ నిరసన తెలియజేశారు.