YS Jagan: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చూస్తుంటే భయంగా ఉంది: ఉండవల్లి అరుణ్ కుమార్
- జగన్ జాగ్రత్త పడకుంటే ఇబ్బందులు తప్పవు
- అవసరమైతే కేంద్రాన్ని నిలదీయాలి
- నోట్ల రద్దు ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది
దేశంలోని 540 మంది ఎంపీల్లో ఏపీకి 25 మంది ఎంపీలే ఉన్నారని, కేంద్రానికి మన అవసరం లేదు కాబట్టి ఏమీ చేయలేకపోతున్నామని ఊరుకుంటే ఇబ్బందులు తప్పవని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే జగన్ ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలని సూచించారు.
పోలవరం ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రాజెక్టు పరిస్థితిపై ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలని అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయం విషయంలో కచ్చితంగా ఉండాలని, అవసరమైతే కేంద్రాన్ని నిలదీయాలని అన్నారు. అలా చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు.
మనం అడగాల్సింది అడుగుతాం.. వారు ఇస్తే ఇస్తారు.. లేదంటే లేదు అంటే కుదరదన్నారు. ఒకవేళ అలాగే జరిగి ఉంటే జ్యోతిబసు పశ్చిమ బెంగాల్‌ను 25 ఏళ్లు పాలించి ఉండేవారు కాదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తుంటే భయంగా ఉందని ఉండవల్లి అన్నారు. నోట్ల రద్దు ప్రభావం ఇప్పుడు దేశంపై నెమ్మదిగా పడుతోందని, ఆ సెగ ఆంధ్రప్రదేశ్‌కూ తాకుతుందని ఉండవల్లి పేర్కొన్నారు. జగన్‌పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అరుణ్ కుమార్ సూచించారు.