PM: హస్తకళా వేదికను ఆకస్మికంగా సందర్శించిన మోదీ.. అక్కడ ఏం తిన్నారో తెలుసా?

PM Enjoys Litti Chokha Kulhad Chai In Surprise Visit To Delhi Craft Fest

  • లిట్టి చోఖా తిని, తందూరీ చాయ్ (కుల్హాద్ టీ) తాగిన ప్రధాన మంత్రి
  • నులక మంచం, వెదురు కుర్చీల్లో కూర్చుని స్నాక్స్
  • లిట్టి చోఖాకు రూ.120, కుల్హాద్ టీకి రూ.40 బిల్లు కట్టిన మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలోని హునార్ హాట్ హస్తకళా వేదికను ఆకస్మికంగా సందర్శించారు. ఆ ప్రాంతమంతటా కలియదిరిగి హస్త కళాకృతులు అమ్ముతున్న దుకాణాలను పరిశీలించారు. అక్కడివారితో మాట్లాడారు. తర్వాత హునార్ హాట్ మధ్యలో ఉన్న ఓ ఓపెన్ హోటల్ లో స్నాక్స్ తిన్నారు.

వెదురు కుర్చీలపై కూర్చుని

ఓపెన్ హోటల్ లో పెట్టిన నులక మంచం, వెదురు కుర్చీలపై ప్రధాన మోదీతోపాటు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూర్చున్నారు. ‘లిట్టి చోఖా’ను తిని, ‘కుల్హాద్’ చాయ్ తాగారు. ప్రధాని మోదీయే వాటికి బిల్లు కూడా కట్టారు. రెండు ప్లేట్ల లిట్టి చోఖాకు రూ.120, రెండు కుల్హాద్ టీలకు రూ.40 చెల్లించారు. తర్వాత కొద్దిసేపు ఆ ప్రాంగణంలో తిరిగి, అక్కడి నుంచి బయలుదేరారు.

ఏమిటీ లిట్టి చోఖా, కుల్హాద్?

గోధుమ పిండితో గుండ్రంగా చేసి, దానిలో పప్పులు, మసాలాలతో చేసిన కర్రీని పెట్టి నూనెలో వేయిస్తారు. దానిని లిట్టీ అంటారు. ఈ లిట్టీలను చోఖాతో కలిపి తింటారు. ఈ చోఖా అంటే టమాటాలు, ఆలుతో చేసే ఓ ప్రత్యేకమైన కర్రీ. బిహార్, జార్ఖండ్, యూపీలోని కొన్ని ప్రాంతాల్లో ఇది సంప్రదాయ వంటకం. ఆ ప్రాంతాల్లో దీనిని ఇష్టంగా తింటారు.

ఇక కుల్హాద్ టీ అంటే తందూరీ చాయ్. ఇది ఈ మధ్య దేశవ్యాప్తంగా అన్ని చోట్లా లభిస్తోంది. కుండల్లాగా మట్టితో చేసే చిన్న గ్లాసులు, కప్పులను నిప్పులపై చాలా సేపు ఉంచి వేడి చేస్తారు. అప్పుడే పెట్టిన టీని ఈ వేడి వేడిగా ఉన్న మట్టి కప్పుల్లో పోసి, ఇస్తారు. మట్టి కప్పు వేడికి టీ కొంత పొంగి, చల్లారుతుంది. కొంత మట్టి వాసన, స్మోకీ ఫ్లేవర్ తో విభిన్నంగా ఉండే ఈ టీకి ఈ మధ్య చాలా డిమాండ్ పెరిగింది.

  • Loading...

More Telugu News