- దారికి అడ్డంగా ఉన్న బండిని పక్కకు జరపాలన్న డెలివరీ బాయ్
- ఆగ్రహంతో గొడవ పెట్టుకున్న పళ్ల బండి వ్యక్తి
- మాటా మాటా పెరగడంతో కత్తి తీసుకువచ్చి దాడి
హోటల్ ముందు పళ్ల బండి వ్యక్తితో గొడవ కారణంగా జొమాటో డెలివరీ బాయ్ ఒకరు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. దారికి అడ్డంగా ఉన్న పళ్ల బండిని జరపాలని అన్నందుకు పళ్ల బండి నిర్వాహకుడు ఆగ్రహించి.. జొమాటో డెలివరీ బాయ్ ను కత్తితో ఇష్టమొచ్చినట్టు పొడిచాడు. ముంబైలోని పోవై సబర్బన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
చిన్న గొడవగా మొదలై..
ముంబైకి చెందిన భాస్కర్ సూరత్కర్ (30 ఏళ్లు) జొమాటోలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. తనకు వచ్చిన ఆర్డర్లను తీసుకోవడానికి పోవై ప్రాంతంలో ఉన్న హోటల్ కు తరచూ వచ్చేవాడు. ఆ హోటల్ ముందు రోడ్డుపై సచిన్ దినేష్ సింగ్ అనే వ్యక్తి పళ్ల బండి పెట్టేవాడు. భాస్కర్ పలుమార్లు ఆ హోటల్ కు వచ్చినప్పుడు అడ్డంగా ఉన్న పళ్లబండిని జరపాలని కోరడంతో ఇద్దరి మధ్యా చిన్నగా గొడవలు జరిగాయి.
ఇద్దరు కలిసి దాడి
తాజాగా బుధవారం ఉదయం కూడా భాస్కర్ ఆర్డర్ పికప్ చేసుకోవడానికి హోటల్ వద్దకు వచ్చాడు. అక్కడ అడ్డంగా ఉన్న పళ్ల బండిని జరపాలన్నాడు. దాంతో ఇద్దరి మధ్యా మాటా మాట పెరిగి పెద్ద గొడవ జరిగింది. దీంతో దినేష్ సింగ్, అతడి స్నేహితుడు హరిరామ్ కలిసి భాస్కర్ పై దాడి చేశారు. కత్తి తీసుకుని ఇష్టమొచ్చినట్టుగా పొడిచారు. ఛాతీలో, కడుపులో కత్తిపోట్లు దిగడంతో భాస్కర్ చనిపోయాడు.
నిఘా వేసి పట్టుకున్న పోలీసులు
ఘటన జరిగిన వెంటనే దినేష్, హరిరామ్ పారిపోయారు. అయితే పోలీసులు నిఘా వేసి.. కొన్ని గంటల్లోనే వారిని కుర్ల రైల్వే స్టేషన్ లో అరెస్టు చేశారు.