Pawan Kalyan: ఆ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించడం మంచి పరిణామం: పవన్ కల్యాణ్
- కర్నూలులో అత్యాచారం, హత్యకు గురైన బాలిక కేసు సీబీఐకి అప్పగింత
- ఈ నిర్ణయం బాధితురాలి కుటుంబానికి ఒకింత ఊరటనిస్తుందన్న పవన్
- ఆ కుటుంబానికి న్యాయం చేయడంలో ఇప్పటికే ఆలస్యమైంది
- సీబీఐ విచారణ ద్వారా ఆ ప్రక్రియను వేగవంతం చేయాలి
కర్నూలులో అత్యాచారం, హత్యకు గురైన బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును ఏపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. దీంతో దీనిపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ ఓ ప్రకటన చేశారు.
'ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం. జగన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాధితురాలి కుటుంబానికి ఒకింత ఊరటనిస్తుంది. ఆ కుటుంబానికి న్యాయం చేయడంలో ఇప్పటికే ఆలస్యమైంది. సీబీఐ విచారణ ద్వారా ఆ ప్రక్రియను వేగవంతం చేయాలి. పాఠశాలకు వెళ్లిన చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టి ఉసురు తీసిన వాళ్లని కఠినంగా శిక్షించాలని కర్నూరు నగరం నడిబొడ్డున లక్షమంది ప్రజలు నినదించారు. ప్రభుత్వంలో కదలిక వచ్చేలా కృషి చేసిన జనసేన నాయకులకి, జనసైనికులకి, ప్రజా సంఘాలకు అభినందనలు' అని పవన్ పేర్కొన్నారు.