AP Legislative Council: కార్యదర్శి నిర్ణయమే అంతిమమని వైసీపీ నేతలు బహిరంగంగా ప్రకటించాలి: మాజీ మంత్రి యనమల
- ఆయన తీరు ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకం
- ఈరోజు మండలిలో జరిగింది...రేపు అసెంబ్లీలో జరగొచ్చు
- చైర్మన్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు
శాసన మండలిలో చైర్మన్ నిర్ణయం అంతిమమో, కార్యదర్శి నిర్ణయం అంతిమమో ధైర్యముంటే వైసీపీ నేతలు బహిరంగంగా ప్రకటించాలని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. మండలి చైర్మన్ అధికారాలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని, అలాచేస్తే సభాధిక్కారం కింద కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు కార్యదర్శిని వెనకేసుకు వస్తున్నారని, నేడు మండలిలో జరిగిన చర్య రేపు అసెంబ్లీలో జరిగితే ఏం చేస్తారని ప్రశ్నించారు.
ఇటువంటి తీరు ప్రజాస్వామ్యానికే విరుద్ధమన్నారు. సెలెక్ట్ కమిటీకి బిల్లులు వెళ్లేటప్పుడు మూజువాణి లేదా ఓటింగ్ లేకుండా నిర్ణయాలు తీసుకున్న సందర్భాలే అధికమని గుర్తు చేశారు. పరిస్థితులకు అనుగుణంగా రూలింగ్ ఇచ్చే అధికారం చైర్మన్‌దని, దాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని అన్నారు.