Samit: చిచ్చరపిడుగులా చెలరేగిపోతున్న జూనియర్ ద్రావిడ్

Flamboyant performance by Rahul Dravid son Samit

  • డబుల్ సెంచరీలతో మోతమోగిస్తున్న ద్రావిడ్ తనయుడు సమిత్
  • అండర్-14 లీగ్ లో సమిత్ భారీ ఇన్నింగ్స్ లు
  • బంతితోనూ రాణిస్తున్న వైనం

ఒకప్పుడు రాహుల్ ద్రావిడ్ బరిలో దిగుతున్నాడంటే ప్రత్యర్థి బౌలర్లు అసహనానికి లోనయ్యేవాళ్లు. ద్రావిడ్ ను అవుట్ చేయాలంటే వాళ్ల అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలు సరిపోవు మరి! ఓవైపు వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూనే, మరోవైపు స్కోరుబోర్డును నడిపించే కళలో ద్రావిడ్ దిట్ట. ఇప్పుడు ద్రావిడ్ కుమారుడు సమిత్ కూడా తండ్రి బాటలోనే బౌలర్లకు కొరకరాని కొయ్యలా పరిణమించాడు. భారీ సెంచరీలు సాధిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం సమిత్ బెంగళూరులో జరిగే అండర్-14 లీగ్ మ్యాచ్ ల్లో రెండు డబుల్ సెంచరీలతో ఔరా అనిపించాడు.

తాజాగా జరిగిన మ్యాచ్ లో ఏకంగా 33 ఫోర్లు కొట్టి డబుల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతే కాదు బౌలింగ్ లోనూ ఓ చేయి వేసి రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. దాంతో సమిత్ జట్టునే విజయం వరించింది. డిసెంబరులో కోల్ కతాలో జరిగిన మ్యాచ్ లోనూ ఇంతే! బంతిని బౌండరీకి పంపడమే లక్ష్యంగా ఆడిన సమిత్ 22 ఫోర్లతో 201 పరుగులు చేశాడు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లోనూ మనవాడి జోరు తగ్గలేదు. 94 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. జూనియర్ ద్రావిడ్ ఇంతకుముందు కూడా సెంచరీల మీద సెంచరీలు బాది కర్ణాటక క్రికెట్ వర్గాలను విస్మయానికి గురిచేశాడు. అంత చిన్నవయసులో బౌలర్లకు చుక్కలు చూపించడం పిట్టకొంచెం కూత ఘనం అన్న సామెతకు నిదర్శనంలా నిలుస్తోంది.

Samit
Rahul Dravid
Cricket
India
  • Loading...

More Telugu News