Pawan Kalyan: హామీ ఇచ్చిన ప్రభుత్వమే రైతులను నిలువునా మోసం చేసింది: పవన్ కల్యాణ్ విమర్శలు
- రైతులు ధాన్యం విక్రయించి వారాలు గడుస్తున్నాయి
- ధాన్యం అమ్మిన రైతులకు రూ.2016 కోట్ల మేరకు చెల్లించాల్సి ఉంది
- రైతులకు డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలి?
హామీ ఇచ్చిన ప్రభుత్వమే రైతులను మోసం చేసిందంటూ వైసీపీ సర్కార్ పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన 48 గంటల్లో రైతులకు సొమ్ము చెల్లిస్తామన్న ప్రభుత్వ హామీ నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. రైతులు ధాన్యం విక్రయించి వారాలు గడుస్తున్నా ఇప్పటికీ డబ్బు రాకపోవడంతో వారు ఇబ్బందిపడుతున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
‘రైతు సంక్షేమం, భరోసా‘ అంటూ నాడు ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని దుయ్యబట్టారు. ధాన్యం అమ్మిన రైతులకు రూ.2016 కోట్ల మేరకు చెల్లించాల్సి ఉందని, లక్ష మంది రైతులు తమకు రావాల్సిన డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారని, రెండో పంట పెట్టుబడికి చేతిలో డబ్బు లేక ఇబ్బందిపడుతున్నారని అన్నారు. రైతులకు డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.