Kasab: నాడు కసబ్ చేతికి 'ఎర్ర దారం' వెనుక కుట్ర!
- కసబ్ ను హిందువుగా చిత్రీకరించే ప్రయత్నం
- ముంబయి దాడులు హిందూ ఉగ్రవాదం అని నిరూపించేందుకు కుట్ర
- కసబ్ పేరును కూడా మార్చారన్న మాజీ పోలీస్ కమిషనర్
- తన పుస్తకంలో వెల్లడించిన వైనం
ముంబయి మారణహోమం అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు అజ్మల్ కసబ్. ఈ పాకిస్థానీ టెర్రరిస్టు తన సహచరులతో కలిసి విచ్చలవిడిగా కాల్పులు, పేలుళ్లకు పాల్పడి వందలాది మందిని పొట్టనబెట్టుకున్నాడు. అయితే, నాడు కసబ్ కాల్పులు జరుపుతున్న సమయంలో అతడి చేతికి ఎర్రని దారం ఉంది. కసబ్ ఆ దారం కట్టుకోవడం వెనుక కుట్ర దాగివుందని ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా తెలిపారు. ఆయన నాటి భయానక దాడుల గురించి 'లెట్ మీ సే ఇట్ నౌ' అనే పుస్తకంలో రాశారు.
కసబ్ చేతికున్న 'ఎర్ర దారం' హిందుత్వాన్ని సూచిస్తుందని, దాడులు చేసింది ఓ హిందూ ఉగ్రవాది అని చూపేందుకు ఆ దారం ధరించాడని మారియా తన పుస్తకంలో వివరించారు. కసబ్ పేరును కూడా హిందుత్వాన్ని సూచించేలా 'సమీర్ దినేశ్ చౌధరీ' అని నకిలీ ఐడీ కార్డు సృష్టించారని తెలిపారు. హిందూ ఉగ్రవాదం వల్లే ముంబయి నరమేధం జరిగిందని నిరూపించడమే నాడు లష్కరే తోయిబా ఉగ్రసంస్థ పన్నాగం అని వెల్లడించారు.
అయితే, అతడు సజీవంగా దొరకడంతో పాటు, భారత దర్యాప్తు సంస్థలు అతడి వాస్తవ గుర్తింపును సమర్థంగా వెలికితీయడంతో పాక్ ఐఎస్ఐ, లష్కరే తోయిబాలకు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టయింది. దాంతో కసబ్ ను చంపేయాలని దావూద్ ఇబ్రహీం ముఠాకు పురమాయించారని కూడా రాకేశ్ మారియా పేర్కొన్నారు.