- బీజేపీ ఎంపీలు రాష్ట్రం కోసం అడిగినవన్నీ చేస్తున్నాం
- రైల్వేల కోసం భారీగా నిధులు ఇచ్చాం
- సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తామనడం బాధాకరం
- కేసీఆర్ ముస్లింలను మభ్యపెడుతున్నారని ఆరోపణ
తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇద్దరూ అవగాహన లోపంతో కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. కేసీఆర్ మత రాజకీయాలకు పాల్పడుతున్నారని, ముస్లింలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ప్రజలు గత ఎన్నికల్లో కేసీఆర్ బిడ్డ కవితను ఓడించడం ద్వారా గట్టి సంకేతం ఇచ్చారని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. నేడు హైదరాబాద్ లో పర్యటించిన సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుంటోందని.. లోక్ సభ, మున్సిపల్ ఎలక్షన్లలో వచ్చిన ఫలితాలే దీనికి సాక్ష్యమని చెప్పారు.
సీఏఏను వ్యతిరేకించడం సరికాదు
సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం బాధాకరమని పీయూష్ గోయల్ అన్నారు. పార్లమెంటు చేసిన చట్టాలను అమలు చేయబోమనడం కుదరదని న్యాయ నిపుణులు కూడా చెప్పారని గుర్తు చేశారు. పొరుగు దేశాల్లో మత హింసకు గురవుతున్న శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తే తప్పేమిటని ప్రశ్నించారు.
ముస్లింలను మోసం చేస్తున్నారు
మజ్లిస్ పార్టీ, ఓవైసీల మెప్పు కోసం సీఎం కేసీఆర్ మత రాజకీయాలకు పాల్పడుతున్నారని పీయూష్ గోయల్ ఆరోపించారు. కేసీఆర్ కేవలం రాజకీయం కోసమే ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు అన్నారని, ముస్లింలను మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లు ఇస్తామంటున్న టీఆర్ఎస్ పార్టీకి సీఏఏను వ్యతిరేకించే హక్కు లేదని స్పష్టం చేశారు.
రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నాం
గత ఐదేళ్లుగా తెలంగాణ అభివృద్ధి చెందడానికి కేంద్ర ప్రభుత్వ సహకారమే కారణమని పీయూష్ గోయల్ అన్నారు. కేంద్రం డబ్బు ఇవ్వలేదన్న కారణంతో రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టు కూడా ఆగలేదని స్పష్టం చేశారు. దక్షిణ మధ్య రైల్వేకు నిధులు భారీగా పెంచామని, అందులో ఒక్క తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకే రూ.2,602 కోట్లు ఇచ్చామని చెప్పారు. ఎంఎంటీఎస్ కు కేంద్రం రూ.500 కోట్లు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వమే తన వాటా ఇవ్వలేదని తెలిపారు.