NRC: పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి ఈ డాక్యుమెంట్లు పనికిరావు: గౌహతి హైకోర్టు

Land and Bank Papers Cant Be Used As Citizenship Proof says Gauhati High Court

  • అసోంలో ప్రకంపనలు పుట్టిస్తున్న ఎన్నార్సీ
  •  భారత పౌరసత్వాన్ని నిరూపించుకోలేకపోయిన 19 లక్షల మంది
  • పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి వందలాది ట్రైబ్యునళ్ల ఏర్పాటు

భూ రెవెన్యూ రసీదులు, బ్యాంక్ స్టేట్ మెంట్లు, పాన్ కార్డులు పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి పనికిరావని గౌహతి హైకోర్టు స్పష్టం చేసింది. ఓ మహిళ వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈమేరకు వ్యాఖ్యానించింది.

వివరాల్లోకి వెళ్తే అసోంలో ఎన్నార్సీ ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. దాదాపు 19 లక్షల మంది ప్రజలను విదేశీయులుగా ఈ ప్రక్రియ ద్వారా గుర్తించారు. దీంతో వీరంతా భారత పౌరసత్వాన్ని కోల్పోయారు. అయితే తమ జాతీయతను నిరూపించుకోవడానికి విదేశీయుల ట్రైబ్యుళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఈ ట్రైబ్యునళ్లకు సరైన ఆధారాలను చూపించడం ద్వారా పౌరసత్వ జాబితాలో స్థానాన్ని కోల్పోయినవారు వారి జాతీయతను నిరూపించుకోవచ్చు. ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే... హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లే వెసులుబాటును కూడా కల్పించారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లినా భారత పౌరసత్వాన్ని నిరూపించుకోలేకపోతే... వారిని అక్రమ వలసదారులుగా గుర్తించి, నిర్బంధ గృహాలకు తరలిస్తారు.

ఈ నేపథ్యంలో, జబేదా బేగం అనే మహిళ కూడా ఎన్నార్సీలో తన పౌరసత్వాన్ని నిరూపించుకోలేకపోయారు. ట్రైబ్యునల్ కూడా ఆమెను భారత పౌరురాలిగా గుర్తించలేదు. దీంతో, ట్రైబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ ఆమె గౌహతి హైకోర్టును ఆశ్రయించారు. తన తండ్రి, తన భర్త గుర్తింపును సూచించే 14 డాక్యుమెంట్లను ఆమె ట్రైబ్యునల్ కు, హైకోర్టుకు సమర్పించారు. అయితే, తన తల్లిదండ్రులతో సంబంధం ఉన్నట్టుగా ఉన్న ఏ ఒక్క డాక్యుమెంటును కూడా ఆమె ఇవ్వలేకపోయారని ట్రైబ్యునల్, హైకోర్టు తెలిపాయి.

విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ, పాన్ కార్డు, బ్యాంక్ డాక్యుమెంట్లు, ల్యాండ్ రెవెన్యూ రసీదులు ఒక వ్యక్తి యొక్క పౌరసత్వాన్ని నిర్ధారించలేవని పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును తాము సమర్థిస్తున్నామని స్పష్టం చేసింది. ఇదే ధర్మాసనం మరో కేసును విచారిస్తూ, ఓటర్ ఐడెంటిటీ కార్డులు కూడా పౌరసత్వానికి ఆధారాలు కావని తేల్చి చెప్పింది. మరోవైపు, ఎన్నార్సీ ప్రక్రియ మొత్తం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కొనసాగుతున్న విషయం గమనార్హం.

  • Error fetching data: Network response was not ok

More Telugu News