Prashant Kishor: నన్ను కన్న కొడుకులా చూసుకున్నారు.. కానీ..: నితీశ్ కుమార్‌పై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు

Political strategist Prashant Kishor on his expulsion from jdu

  • బీజేపీతో మిత్రత్వాన్ని కొనసాగించడానికి నితీశ్ రాజీ
  • గాంధీజీ ఆదర్శాలను జేడీయూ ఎన్నటికీ విడవబోదని నితీశ్‌జీ అన్నారు
  • కానీ, గాంధీని చంపిన గాడ్సేకి సానుకూలంగా ఉన్న వారికి మద్దతుగా ఉన్నారు
  • నేను రాష్ట్రంలో ఓ రాజకీయ శక్తిని సృష్టిస్తాను

జేడీయూ నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు ప్రశాంత్ కిశోర్ పాట్నాలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'నన్ను నితీశ్ కుమార్‌ కన్న కొడుకులా చూసుకున్నారు. ఆయనను నేను గౌరవిస్తాను. అయితే, బీజేపీతో మిత్రత్వాన్ని కొనసాగించడానికి నితీశ్ కుమార్‌ సైద్ధాంతిక విషయాల పట్ల రాజీ పడ్డారు' అని తెలిపారు.

'ఎన్డీఏలో నితీశ్ ఉండాల్సిన అవసరం లేదు. జేడీయూ సిద్ధాంతాల పట్ల నితీశ్‌ జీకి, నాకు మధ్య చర్చలు జరిగాయి. గాంధీజీ ఆదర్శాలను జేడీయూ ఎన్నటికీ విడవబోదని నితీశ్‌జీ అన్నారు. కానీ, ఇప్పుడు ఆ పార్టీ.. గాంధీజీని చంపిన నాథురామ్ గాడ్సే పట్ల సానుకూలంగా ఉన్న వారికి మద్దతుగా ఉంది' అని తెలిపారు.

'నాకు ఇప్పటికీ నితీశ్ పట్ల గౌరవం ఉంది. నన్ను బహిష్కరిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల నేను ఆయనను ప్రశ్నించాలనుకోవట్లేదు' అని వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే బిహార్‌ చాలా వెనుకబడి ఉందని, నితీశ్‌ కుమార్‌ పాలనలోనూ రాష్ట్రం అభివృద్ధి చెందలేదని ఆయన విమర్శలు గుప్పించారు.

తాను రాష్ట్రంలో వేలాది మంది యువకులతో ఓ రాజకీయ శక్తిని సృష్టిస్తానని తెలిపారు. బాత్ బిహారీ నినాదంతో ముందుకు వెళ్తానని చెప్పారు. ఎన్నికల్లో పోటీ కోసం మాత్రమే కాకుండా బిహార్‌ను అభివృద్ధి చేయాలన్న విషయంపై దృష్టి పెట్టి ముందుకు వెళ్తానని చెప్పారు.

కాగా, జేడీయూ ఉపాధ్యక్షుడిగా ఉన్న పీకేతో పాటు పార్టీ రెబల్‌ లీడర్‌ పవన్‌ వర్మను కూడా పార్టీ నుంచి నితీశ్ ఇటీవల బహిష్కరించారు. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) జేడీయూ మద్దతు ఇవ్వడాన్ని తప్పుబడుతూ ప్రశాంత్‌ బహిరంగంగానే విమర్శలు చేసిన నేపథ్యంలో నితీశ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు క్రమశిక్షణ రాహిత్యం కింద పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు జేడీయూ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ తన రాజకీయ భవిష్యత్తుపై ఈ విధంగా ప్రకటన చేశారు.

Prashant Kishor
jdu
bihar
Nitish Kumar
  • Loading...

More Telugu News