Hyderabad: సీటు కోసం మహిళతో గొడవ.. బస్సులోనే కత్తితో పొడిచి పరారైన దుండగుడు

passenger attack woman with knife in hyderabad city bus

  • మహిళల సీటులో కూర్చున్న నిందితుడు
  • లేవాలన్నందుకు గొడవ
  • చెప్పుతో కొట్టిన మహిళ.. కత్తితో పొడిచిన నిందితుడు

బస్సులో సీటు కోసం జరిగిన గొడవ ఓ మహిళ ప్రాణాల మీదికి తీసుకొచ్చింది. సీటు ఇవ్వలేదన్న కోపంతో మహిళపై ఓ వ్యక్తి కత్తితో దాడిచేసి పరారయ్యాడు. హైదరాబాద్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్, మారేడ్‌పల్లికి చెందిన అనురాధ (34) ఆదివారం రాత్రి సికింద్రాబాద్‌లో అఫ్జల్‌గంజ్ వైపు వెళ్లే బస్సు ఎక్కింది. బస్సు మొజంజాహి మార్కెట్‌కు చేరుకోగానే మహిళల సీట్లు ఖాళీ కావడంతో కూర్చునేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో మరో వ్యక్తి వచ్చి అదే సీటులో కూర్చున్నాడు.

అది మహిళల కోసం కేటాయించిన సీటని, లేవాలని కోరింది. దీంతో మండిపడిన సదరు వ్యక్తి ఆమెపై తిట్ల దండకం అందుకోవడంతో ఘర్షణ మరింత ముదిరింది. ఈ క్రమంలో అతడు ఆమెను అసభ్య పదజాలంతో దూషించాడు. కోపంతో ఊగిపోయిన మహిళ చెప్పుతో కొట్టింది. దీంతో మరింత రెచ్చిపోయిన నిందితుడు జేబులోంచి కత్తి తీసి ఆమె పొట్టలో పొడిచాడు. ఆమె పెద్దగా అరవడంతో డ్రైవర్ బస్సు ఆపేశాడు.

అదే అదునుగా భావించిన నిందితుడు బస్సు దిగి పరారయ్యాడు. బాధితురాలిని నేరుగా అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన డ్రైవర్, కండక్టర్ ఘటనపై వారికి ఫిర్యాదు చేశారు. గాయపడిన బాధితురాలిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘటన బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేశారు.

Hyderabad
rtc bus
knife
woman
  • Loading...

More Telugu News