CAA: సీఏఏపై మీ వైఖరేంటో చెప్పి గందరగోళం తొలగించండి: నవీన్ పట్నాయక్‌ను నిలదీసిన కాంగ్రెస్
- బీజేడీ కేంద్రంలో ఒకలా, రాష్ట్రంలో ఒకలా మాట్లాడుతోంది
- అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలను గుర్తు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సలుజా
- ఈ నెల 28 నుంచి ఒడిశాలో సీఏఏ అనుకూల సభలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని బయటపెట్టాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సీఏఏపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విరివిగా సభలు ఏర్పాటు చేస్తున్న కేంద్రం.. ఈ నెల 28 నుంచి రెండు రోజులపాటు ఒడిశాలో సీఏఏ అనుకూల సభలు నిర్వహించనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సభల్లో పాల్గొంటారు. ఈ విషయాన్ని శాసనసభలో ప్రస్తావించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్ఎస్ సలుజా.. సీఏఏపై ప్రభుత్వం, అధికార పార్టీ (బీజేడీ) వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
బీజేడీ ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభలో సీఏఏకు మద్దతు ఇచ్చారన్న సలుజా.. డిసెంబరులో భువనేశ్వర్‌లో మైనారిటీ వర్గాల నేతలతో జరిగిన సమావేశంలో మాత్రం సీఏఏకు తాము వ్యతిరేకమని సీఎం నవీన్ పట్నాయక్ చెప్పారని గుర్తు చేశారు. కేంద్రంలో ఒకలా, రాష్ట్రంలో ఒకలా మాట్లాడుతుండడంతో ప్రజల్లో గందరగోళం నెలకొందన్నారు. కాబట్టి సీఎం ఇప్పటికైనా తమ వైఖరేంటో స్పష్టం చేసి ఆ గందరగోళానికి తెరదించాలని సలుజా డిమాండ్ చేశారు.