- ఎన్సార్సీ కింద పేరు తొలగించడంపై మునీంద్ర విశ్వాస్ అనే వ్యక్తి పిటిషన్
- తాను ఓటు కూడా వేశానని, పౌరుడిగా గుర్తించాలని విజ్ఞప్తి
- ఆ ఒక్కదానితో పౌరుడిగా తేల్చలేమన్న కోర్టు
దేశ పౌరసత్వానికి ఓటరు కార్డు సాక్ష్యం కాదని, ఓటరు కార్డు ఉన్నంత మాత్రాన దేశ పౌరులుగా చెప్పలేమని గౌహతి హైకోర్టు స్పష్టం చేసింది. పౌరసత్వానికి సంబంధించి తగిన ఆధారాలు కావాలని పేర్కొంది. తనకు ఓటరు కార్డు ఉందని, తాను ఓటు కూడా వేశానని.. దాని ఆధారంగా తనను భారత పౌరుడిగా గుర్తించాలని మునీంద్ర విశ్వాస్ అనే వ్యక్తి వేసిన పిటిషన్లో కోర్టు ఈ తీర్పు నిచ్చింది.
ఎన్నార్సీలో పేర్లు పేర్లు తొలగించడంతో..
బంగ్లాదేశ్ నుంచి ఇతర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో జనం వలస వచ్చి ఈశాన్య రాష్ట్రాల్లో సెటిలైన విషయం తెలిసిందే. దీంతో అసలైన పౌరులెవరో తేల్చేందుకు అస్సాంలో ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ షిప్ (ఎన్నార్సీ)’ని చేపట్టారు. ఆ లిస్టులో మునీంద్ర బిశ్వాస్ పేరు లేదు. ఆయన దేశ పౌరుడన్న దానికి తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో ఎన్నార్సీలో చేర్చలేదని అధికారులు స్పష్టం చేశారు. దీనిపై మునీంద్ర హైకోర్టును ఆశ్రయించారు. తమ కుటుంబం బెంగాల్ నుంచి అస్సాంలోని టిన్సుకియాకు వలస వచ్చిందని చెప్పారు.
వలస కటాఫ్ డేట్ లెక్కలు కూడా..
1997 సంవత్సరంలోనే తన పేరు ఓటర్ల జాబితాలో ఉందని, తాను ఓటు వేశానని మునీంద్ర కోర్టుకు చెప్పారు. తన ఓటరు కార్డును కోర్టుకు సమర్పించి, తనను భారత పౌరుడిగా గుర్తించేలా ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. అస్సాంలో 1966 ను కటాఫ్ డేట్ గా నిర్ణయించారని, మునీంద్ర కుటుంబం అంతకన్నా ముందు వలస వచ్చినట్టుగా ఆధారాలేమీ లేవని తేల్చింది. కేవలం ఓటరు కార్డు ఉన్నంత మాత్రాన పౌరులు కాదని స్పష్టం చేస్తూ.. మునీంద్ర పిటిషన్ ను కొట్టివేసింది.