Peddapalli MLA: పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి కుటుంబం మృతి ఘటన: హత్యా? ప్రమాదమా? పలు అనుమానాలు!
- మృతుల కాల్ డేటాను పరిశీలిస్తున్న పోలీసులు
- అన్ని కోణాల్లోనూ దర్యాఫ్తు చేస్తున్నాం
- వారి బిడ్డ ఆచూకీ కోసం గాలింపు
దాదాపు 15 రోజుల క్రితం అదృశ్యమై, ఈ ఉదయం కారులో విగత జీవులుగా కనిపించిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చెల్లెలు రాధ, బావ సత్యనారాయణరెడ్డి, వాళ్ల కూతురు వినయశ్రీ మృతిని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, కారు కాలువలో పడడం అన్నది ప్రమాదవశాత్తూ జరిగినదేనా? లేక పథకం ప్రకారం జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. వారి కాల్ డేటాను, గతంలో వారి ఆర్థిక లావాదేవీలను, వారి కారు ప్రయాణించిన మార్గంలోని అన్ని సీసీ కెమెరాలను పరిశీలించడం ప్రారంభించారు.
ఇదిలావుండగా, వీరు 22 రోజుల క్రితమే ఇంటి నుంచి వెళ్లారన్న మరో వాదన తాజాగా తెరపైకి వచ్చింది. నిన్న కాలువ ఒడ్డుపై వెళుతున్న మరో దంపతుల బైక్ అదుపు తప్పి కాలువలోకి జారిపోగా, వారి జాడ కోసం అధికారులు నీటి విడుదలను ఆపివేయడంతో, ఈ కారు బయట పడింది. సత్యనారాయణ రెడ్డి, రాధ, వారి కుమార్తె వినయశ్రీలు కనిపించకుండా పోవడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకోలేదన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.