Telangana: లౌకిక వాదానికి తెలంగాణ మారుపేరు.. సీఏఏను రద్దు చేయండి: కేంద్రాన్ని కోరిన కేసీఆర్ సర్కారు

Telangana govt urges center to abolish CAA

  • సీఏఏను రద్దు చేయాలని కోరుతూ మంత్రి మండలి తీర్మానం
  • సీఏఏ వంటి చట్టాలకు తాము పూర్తిగా వ్యతిరేకమన్న మంత్రి మండలి
  • మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నిన్న జరిగిన సుదీర్ఘ సమావేశంలో మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. లౌకిక వాదానికి తెలంగాణ మారుపేరని, కాబట్టి సీఏఏ వంటి చట్టాలకు తాము పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేసింది. దీనిని రద్దు చేయాలని కోరుతూ తీర్మానం చేసింది. వచ్చే శాసనసభ సమావేశాల్లో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేయనున్నట్టు తెలిపింది. కేంద్రం కనుక ఈ విషయంలో వెనక్కి తగ్గకుంటే హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పేర్కొంది. సీఏఏకు వ్యతిరేకంగా ఇప్పటికే పంజాబ్, కేరళ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తీర్మానం చేశాయి.

ఈ నెల 24 నుంచి పది రోజులపాటు ‘పట్టణ ప్రగతి’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేసేందుకు రేపు ప్రగతి భవన్‌లో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నారు. అలాగే, రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం ద్వారా విక్రయించాలని కూడా మంత్రి మండలి నిర్ణయించింది. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించినందుకు అధికారులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు.

14వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన రూ. 811 కోట్ల నిధుల్లో రూ. 500 కోట్లను నగరపాలక, పురపాలక సంఘాలకు, రూ.311 కోట్లను జీహెచ్ఎంసీకి కేటాయించాలని నిర్ణయించింది. నగర, పురపాలక సంఘాల్లో పారిశుద్ధ్య పనులకు 3100 వాహనాలను సమకూర్చాలని కూడా నిర్ణయం తీసుకుంది. తెలంగాణ లోకాయుక్త చట్టంపై తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

Telangana
Ministers
KCR
CAA
BJP
  • Loading...

More Telugu News