GVL Narasimha Rao: రాణులు ఎంతమంది ఉన్నా పట్టపురాణి ఎవరో తేల్చేది రాజే: జీవీఎల్

BJP MP GVL Narasimha Rao comments on AP capital issue

  • మూడు రాజధానుల అంశంపై జీవీఎల్ స్పందన
  • ప్రధాన రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదేనన్న జీవీఎల్
  • కేంద్రం జోక్యం చేసుకోదని పునరుద్ఘాటన

ఏపీకి మూడు రాజధానుల అంశంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారడం తెలిసిందే. ప్రస్తుతం జీవీఎల్ పై భారీగా విమర్శలు వస్తున్నాయి. ఆయన వైసీపీ ఏజెంటు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఆయన ఓ ఇంటర్వ్యూలో బదులిచ్చారు. తనపై పచ్చచొక్కాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తాను బీజేపీకి స్పెషల్ ఏజెంటునని చెప్పుకొచ్చారు.

మూడు రాజధానుల అంశంలో కేంద్రమంత్రులు చెప్పిన మాటలే తాను కూడా చెప్పానని, అది కొందరికి నచ్చక వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారని ఆరోపించారు. ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో తనకు ఎలాంటి విభేదాలు లేవని జీవీఎల్ స్పష్టం చేశారు. ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని కన్నా కూడా ఎక్కడా అనలేదని చెప్పారు.

తాను వైసీపీ తరఫున మాట్లాడుతున్నానడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన ఆరేళ్ల అనుభవంలో తన వ్యాఖ్యలను పార్టీ ఎప్పుడూ తప్పుబట్టలేదని తెలిపారు. ఏపీ రాజధాని గురించి చెబుతూ, సాధారణంగా రాష్ట్ర సచివాలయం ఎక్కడ ఉంటే దాన్నే రాష్ట్ర రాజధానిగా భావించాల్సి ఉంటుందని అన్నారు. రాణులు ఎంతమంది ఉన్నా పట్టపురాణిని నిర్ణయించేది రాజేనని, రాష్ట్ర రాజధాని వ్యవహారం కూడా అంతేనని స్పష్టం చేశారు. ఏపీలో రాజధానులు ఎన్ని ఉన్నా ప్రధాన రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు.

GVL Narasimha Rao
BJP
Andhra Pradesh
AP Capital
  • Loading...

More Telugu News