Tejas: తెలుగు రాష్ట్రాల్లో తొలి ప్రైవేటు రైలు... హైదరాబాద్ నుంచి తిరుపతికి!

First Tejas form Hyderabad is up to Tirupati

  • 100 మార్గాల్లో 150 ప్రైవేటు రైళ్లు
  • ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ
  • ఆలస్యమైతే పరిహారం చెల్లింపు

దేశవ్యాప్తంగా 100 మార్గాల్లో 150 ప్రైవేటు రైళ్లను నడిపించేందుకు రైల్వే శాఖ సిద్ధమైన నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో తొలి రైలు హైదరాబాద్ పరిధిలోని లింగంపల్లి నుంచి తిరుపతి మధ్య నడవనుంది. ఐదు నెలల క్రితం న్యూఢిల్లీ నుంచి లక్నో మధ్య, ఆపై ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య తేజస్ రైళ్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అతి త్వరలో ఇండోర్ నుంచి వారణాసి మధ్య కూడా తేజస్ నడవనుంది. ఈ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది.

ఏదైనా కారణంతో రైలు గమ్యాన్ని చేరడంలో జాప్యం జరిగితే, ప్రయాణికులకు రూ. 250 వరకూ పరిహారం లభిస్తుంది. ఈ పరిహారాన్ని రైలును లీజుకు తీసుకున్న సంస్థకు బదులుగా, ఐఆర్సీటీసీ ఇవ్వాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో ఐఆర్సీటీసీపై భారాన్ని తొలగించేందుకు ప్రైవేటు రైళ్లు వస్తుంటే, మిగతా రైళ్లను మరింత ఆలస్యంగా నడిపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

ఇక ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య 8 రైళ్లు నడుస్తున్నాయి. ఇవన్నీ ప్రతి రోజూ కిటకిటలాడుతూ ప్రయాణించేవే. వెంకటాద్రి, నారాయణాద్రి, పద్మావతి, రాయలసీమ ఎక్స్ ప్రెస్, కృష్ణా ఎక్స్ ప్రెస్, శబరి ఎక్స్ ప్రెస్ తదితర రైళ్లతో పాటు కొన్ని స్పెషల్ రైళ్లు కూడా తిరుపతికి వెళుతుంటాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 11 ప్రైవేటు రైళ్లకు అనుమతి లభించగా, తొలి టెండర్ తిరుపతికి ప్రయాణించే రైలుకు పిలవాలని అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. ఈ రైళ్లలో చార్జీలు అధికంగా ఉంటాయి. సీట్లు నిండుతున్న కొద్దీ ధర పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ రైలెక్కాలంటే మరింత వదిలించుకోవాల్సిందే.

  • Loading...

More Telugu News