Wife Fruad: పదహారేళ్ల ప్లాన్... వ్యాపారవేత్తను ఆనూహ్యంగా మోసం చేసిన భార్య!
- 16 సంవత్సరాల క్రితం చావ్లాను పెళ్లాడిన అహూజా
- తన తెలివితేటలో భర్త వ్యాపారాన్ని లాభాల్లోకి చేర్చిన చావ్లా
- నిదానంగా లక్షల్లో డబ్బు సొంత ఖాతాల్లోకి
- కేసు నమోదు చేసుకున్న సెంట్రల్ క్రైమ్ పోలీసులు
పదహారేళ్ల పాటు కాపురం చేసిన భార్య, వ్యాపారవేత్త అయిన తన భర్తను అనూహ్యంగా మోసం చేసి ఇంటి నుంచి పారిపోయింది. ఆసక్తికరమైన ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. సెంట్రల్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే...
అబిడ్స్ లో నివాసం ఉంటున్న అహూజా, ఓ సంగీత, నృత్య శిక్షణ సంస్థ ఫ్రాంచైజీని నిర్వహిస్తున్నాడు. పదహారు సంవత్సరాల క్రితం ఢిల్లీకి చెందిన చావ్లా అనే యువతి బంధువుల ద్వారా పరిచయం కాగా, వారిద్దరూ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ లో కాపురం పెట్టిన తరువాత, ఆమె పలు బ్యాంకుల్లో ఆర్థిక సలహాదారుగా పనిచేస్తూ, భర్తకు చేదోడు వాదోడుగా నిలిచింది. ఈ క్రమంలో అహూజా సోదరుడు సందీప్ నిర్వహిస్తున్న ఫ్యాషన్ దుస్తుల బిజినెస్ లో పెట్టుబడి పెట్టి, తన తెలివితేటలతో లాభాల బాట పట్టించింది.
ఆపై భర్తతో చర్చించి, ఆయన వ్యాపారంలోకీ భాగస్వామిగా ప్రవేశించింది. ఆమె పనితీరు బాగా నచ్చడంతో ఇతర వ్యాపకాల్లో అహూజా మునిగిపోయాడు. దీంతో కంపెనీలో పూర్తి స్వేచ్ఛ పొందిన ఆమె, తొలుత బ్యాంకు ఖాతాలను మరో బ్యాంకుకు మళ్లించి, ఆర్థిక వ్యవహారాలను తన చేతుల్లోకి తీసుకుంది. ఆపై కంపెనీని లాభాల్లోకి నడిపించి, బ్యాంకుల నుంచి తన సొంత ఖాతాలోకి రూ. 1.40 కోట్లను మళ్లించుకుంది. భర్త కంపెనీలోని 30 శాతం వాటాను సొంతం చేసుకుంది.
ఆపై తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వస్తానని చెప్పి, కొంతకాలం క్రితం వెళ్లిన చావ్లా, ఇక ఇంటికి రాలేదు. భార్య వెళ్లిన తరువాత కంపెనీ లెక్కలను చూసుకున్న అహూజా నిర్ఘాంతపోయాడు. తనకు తెలియకుండా లక్షల్లో డబ్బును భార్య కాజేసిందని గమనించి అవాక్కయ్యాడు. అప్పటి నుంచి ఎంత ప్రయత్నించినా భార్య నుంచి గానీ, అత్తమామలుగానీ స్పందన రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసును విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.