Donald Trump: ట్రంప్ పర్యటనలో మూడు గంటల కోసం రూ. 100 కోట్లు ఖర్చు చేస్తున్న అధికారులు!
- మరో వారంలో ట్రంప్ భారత్ పర్యటన
- అహ్మదాబాద్ లో మోదీతో కలిసి ర్యాలీ
- 10 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు
మరో వారంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, సతీ సమేతంగా భారత్ లో పర్యటించనున్నారన్న సంగతి తెలిసిందే. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో కలిసి ఆయన అహ్మదాబాద్ లో జరిగే భారీ ర్యాలీలో పాల్గొననుండగా, మూడు గంటల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు రూ. 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 14 కోట్లు, మిగతాది అహ్మదాబాద్ నగర పాలక సంస్థ (ఏఎంసీ), అహ్మదాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (ఏయూడీఏ) సంయుక్తంగా భరిస్తున్నాయి. ఈ నిధులతో ట్రంప్ పర్యటించే ప్రాంతాల్లో నూతన రహదారులు, రహదారుల మరమ్మతులు జరుగుతుండగా, భద్రత నిమిత్తం రూ. 15 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారు.
ఇక 22 కిలోమీటర్ల ర్యాలీ అనంతరం మొతేరా స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు రూ. 10 కోట్ల వరకూ, రోడ్ల మధ్యలో ఈత జాతి చెట్లతో సుందరీకరణకు రూ.6 కోట్లు, రోడ్ షో వెంబడి సాంస్కృతిక కార్యక్రమాలకు రూ. 4 కోట్లను కేటాయించారు. ఈ ర్యాలీకి దాదాపు 10 వేల మంది పోలీసులు భద్రత కల్పిస్తున్నారు.