Donald Trump: నెంబర్ వన్ నేను, నెంబర్ టూ మోదీ అని జుకర్ బర్గ్ చెప్పారు.. నేను ఇండియాకి పోతున్నా: ట్రంప్

Going to India says Trump

  • ఫేస్ బుక్ లో నేను, మోదీ టాప్ లో ఉన్నామని జుకెర్ బర్గ్ చెప్పారు
  • ఇండియాకు వెళ్లడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా
  • భారత్ పర్యటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా

భారత్ పర్యటన కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన మనసులోని మాటను వెల్లడించారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ, 'ఇండియాకు వెళ్లడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఫేస్ బుక్ లో నేను నెంబర్ వన్, మోదీ నెంబర్ టూ అని మార్క్ జుకర్ బర్గ్ ఈ మధ్యనే చెప్పారు. రెండు వారాల్లో ఇండియాకు వెళ్తున్నా. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా' అని అన్నారు.

తన భార్య మెలానియా ట్రంప్ తో కలసి ఈనెల 24, 25 తేదీల్లో భారత్ లో ట్రంప్ పర్యటించబోతున్నారు. ఢిల్లీ, అహ్మదాబాదుల్లో వీరి పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధాలు మరింత బలోపేతమయ్యేలా పలు ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది. మన దేశానికి చెందిన పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు కూడా ట్రంప్, మోదీల చర్చల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

మరోవైపు, ట్రంప్ కు ఊహించని విధంగా ఆహ్వానం పలికేందుకు అహ్మదాబాద్ రెడీ అవుతోంది. విమానాశ్రయం నుంచి మొతేరా స్టేడియం వరకు లక్షలాది మంది మోదీ, ట్రంప్ కు ఆహ్వానం పలకనున్నారు. లక్షమంది ప్రేక్షకులు కూర్చునే కెపాసిటీ ఉన్న ఈ స్టేడియంను కొత్తగా నిర్మించారు. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఇది. ఈ స్టేడియంలో ఇరు దేశాల అధినేతలు ప్రసంగించనున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News