Supreme Court: ఈ దేశంలో బతకడం కంటే వేరే దేశానికి వెళ్లిపోవడమే బెటర్: సుప్రీంకోర్టు జడ్జి తీవ్ర వ్యాఖ్యలు

Supreme Court Judges Talked Of Leaving Country

  • టెలికాం కంపెనీల నుంచి బకాయిలు వసూలు చేయొద్దంటూ డెస్క్ అధికారి లేఖ
  • మా ఆదేశాలనే పక్కన పెట్టేస్తారా? అంటూ జస్టిస్ అరుణ్ మిశ్రా ఆగ్రహం
  • ఈ కోర్టులో పని చేయకపోవడమే మంచిదనిపిస్తోందని వ్యాఖ్య

టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. 92 వేల కోట్ల ఏజీఆర్ బకాయిలను వసూలు చేయవద్దంటూ సంబంధిత అధికారులకు టెలికాం మంత్రిత్వ శాఖ డెస్క్ ఆఫీసర్ రాసిన లేఖపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డెస్క్ అధికారితో పాటు టెలికాం సంస్థలకు కోర్టు ధిక్కార నోటీసులు పంపింది.

ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్రా మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు. సుప్రీంకోర్టును ఎత్తేద్దామా? అని ఆయన ప్రశ్నించారు. తమ ఆదేశాలనే డెస్క్ అధికారి పక్కనపెట్టేశారని... అతనికి అతను జడ్జిగా ఊహించుకున్నట్టున్నారని అన్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సదరు అధికారి లేఖలు రాశారని... సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన ఎలా పక్కన పెడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఈ దేశంలో ఎలాంటి న్యాయం మిగల్లేదని జస్టిస్ అరుణ్ మిశ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో బతకడం కంటే... దేశాన్ని వదిలి వెళ్లిపోవడమే మంచిదని అన్నారు. తాను ఎంతో ఆవేదనకు గురవుతున్నానని... ఈ కోర్టులో పని చేయకపోవడమే మంచిదనిపిస్తోందని చెప్పారు. ఇలాంటి వ్యవస్థలో ఎలా పని చేయాలని ప్రశ్నించారు. సదరు అధికారి నిర్ణయం వెనుక డబ్బు కోణం ఉందా? అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఆ అధికారి జైలుకు వెళ్లాల్సిందేనని అన్నారు.

Supreme Court
Justice Arun Mishra
Telecom Companies
AGR Dues
Desk Officer
  • Loading...

More Telugu News