- వైరస్ దాడి ఇంకా తగ్గడం లేదన్న చైనా హెల్త్ కమిషన్
- జపాన్ సమీపంలో సముద్రంలో ఉంచేసిన షిప్ లో 200 మందికి కరోనా
- 15 రోజులుగా సముద్రంలోనే ఉన్న మరో షిప్ ను తమ దేశానికి రానిచ్చిన కాంబోడియా
చైనాలో కోవిడ్-19 (కరోనా వైరస్) దాడి ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం నాటికి మరో 5,090 మందికి కరోనా వైరస్ సోకిందని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. మొత్తంగా బాధితుల సంఖ్య 63,851 కు చేరినట్టు ప్రకటించింది. ఇప్పటివరకు కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 1,381కి పెరిగినట్టు తెలిపింది.
వేరే దేశాల్లో పెరగడం లేదు: డబ్ల్యూహెచ్ఓ
చైనా మినహా ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో కూడా కరోనా వైరస్ బారినపడ్డ వారి సంఖ్య పెద్దగా పెరగడం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. జపాన్ లో మాత్రం 44 మందికి కొత్తగా వైరస్ సోకిందని, అక్కడ బాధితుల సంఖ్య 218కి చేరిందని తెలిపింది.
జపాన్ సమీపంలోని షిప్ లో 200 మంది బాధితులు
కొన్ని రోజులుగా జపాన్ సముద్ర తీరంలో ఆపేసిన క్రూయిజ్ షిప్ లో ఉన్న ప్రయాణికుల్లో 200 మందికి కరోనా వైరస్ వ్యాపించినట్టుగా గుర్తించారు. వారందరికీ షిప్ లోనే ట్రీట్ మెంట్ చేస్తున్నారు. భూభాగంలోకి అనుమతించడం లేదు.
కాంబోడియాకు మరో షిప్
కరోనా వైరస్ సోకినవారు ఉన్నారన్న సందేహంతో రెండు వారాలుగా సముద్రంలోనే ఉంచేసిన క్రూయిజ్ షిప్ ను తమ దేశానికి రానిచ్చేందుకు కాంబోడియా అంగీకరించింది. ఎంఎస్ వెస్టర్ డ్యామ్ గా పేరున్న ఆ క్రూయిజ్ షిప్లో 1,455 మంది ప్యాసింజర్లు, 802 మంది సిబ్బంది ఉన్నారు. జపాన్ సహా ఐదు దేశాలు ఈ షిప్ ను తమ దేశానికి రానివ్వలేదు. చివరికి కాంబోడియా అంగీకరించింది.