Rahul Gandhi: పుల్వామా దాడిపై 3 ప్రశ్నలను సంధించిన రాహుల్ గాంధీ.. మండిపడ్డ బీజేపీ!

Rahul Gandhis 3 questions to BJP On Pulwama anniversary

  • ఈ దాడులతో ఎక్కువగా లబ్ధి పొందింది ఎవరు? 
  • దాడులకు సంబంధించి జరిపిన దర్యాప్తులో ఏం తేలింది? 
  • భద్రతా వైఫల్యాలపై బీజేపీ ప్రభుత్వంలో ఎవరు బాధ్యత తీసుకుంటారు?

పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయి నేటికి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తైంది. ఈ నేపథ్యంలో, దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాళి అర్పించారు. మరోవైపు బీజేపీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మూడు ప్రశ్నలను సంధించారు.

పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది సీఆర్పీఎఫ్ అమరవీరులను ఈరోజు మనం స్మరించుకుంటున్నామని రాహుల్ చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని మూడు ప్రశ్నలు అడుగుతున్నానని అన్నారు.

ఈ దాడులతో ఎక్కువగా లబ్ధి పొందింది ఎవరు? దాడులకు సంబంధించి జరిపిన దర్యాప్తులో ఏం తేలింది? దాడులకు కారణమైన భద్రతా వైఫల్యాలపై బీజేపీ ప్రభుత్వంలో ఎవరు బాధ్యత తీసుకుంటారు? అని రాహుల్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ కూడా అదే స్థాయిలో స్పందించింది. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను అగౌరవపరిచేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడింది. లష్కరే తాయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు రాహుల్ సానుభూతిపరుడని ఆరోపించింది. అంతర్జాతీయ వేదికలపై భారత్ ను కౌంటర్ చేసేందుకు పాకిస్థాన్ కు సహకరించేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.

2019 ఫిబ్రవరి 14న జైషే మొహమ్మద్ కు చెందిన ఓ సూసైడ్ బాంబర్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 2,500 మందితో కూడిన సీఆర్పీఎఫ్ కాన్వాయ్ జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్తుండగా పుల్వామా వద్ద ఈ దాడి జరిగింది. ఈ దాడుల అనంతరం పాక్ పై భారత్ విరుచుకుపడింది. పాకిస్థాన్ గడ్డపై ఉన్న బాలాకోట్ లోని జైషే మొహమ్మద్ క్యాంప్ పై వైమానిక దాడులు జరిపి, దాన్ని ధ్వంసం చేసింది.

Rahul Gandhi
Congress
Pulwama Attacks
BJP
  • Loading...

More Telugu News