Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ మనసులో ఏముంది...ఈ నెల 18న ఏం చెప్పబోతున్నాడు?
- రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఇదే
- ఇటీవలే జేడీయూ నుంచి బహిష్కరణ వేటు
- వ్యూహకర్త అడుగులు ఎటన్న చర్చ
రాజకీయ వర్గాల్లో పరిచయం అక్కర్లేని పేరు ప్రశాంత్ కిశోర్ (పీకే). మొన్న ఏపీ...నిన్న ఢిల్లీ... రేపు తమిళనాడు, పశ్చిమబెంగాల్....ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల చూపు ఆయనవైపే. అప్పటికప్పుడు వ్యూహం రచించడం, అవసరమైతే మార్చడంలో దిట్ట. గెలుపు గుర్రాన్ని ఎక్కించడంలో నేర్పరి. జాతీయ పార్టీ బీజేపీ, దాని వ్యూహకర్తల ద్వయం మోదీ, అమిత్ షాల ఆలోచనలకు కూడా అందనంత ఎత్తుకు పైఎత్తు వ్యూహాలతో ఢిల్లీలో వారిని బోల్తా కొట్టించిన ఘనుడు ప్రశాంత్ కిశోర్. బీజేపీ నేతలంతా జాతీయాంశాలపై ప్రచారం నిర్వహిస్తే.. కేజ్రీవాల్ మాత్రం లోకల్ అంశాలను, అభివృద్ధి నినాదాన్ని అందిపుచ్చుకోవడంలో పీకే చాణక్యం ఉందంటారు.
ఇంతటి చాణుక్యుడైనా వ్యక్తిగత రాజకీయ ప్రయాణం మాత్రం సాఫీగా సాగడం లేదు. సొంత రాష్ట్రం బీహార్‌లో అధికారం నెరపుతున్న జేడీయూలో చేరినా అది ఎక్కువకాలం కొనసాగలేదు. ఇటీవల ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ నుంచి ప్రశాంత్ కిశోర్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన ఏదో సంచలన ప్రకటన చేస్తారనుకుంటే సైలెంట్ గా వెళ్లి ఢిల్లీ ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమైపోయారు.
ఢిల్లీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడినాక ఈ నెల 11న ఆయన ఏదైనా ప్రకటన చేస్తారని అంతా ఎదురు చూశారు. అయినా ఆయన కిమ్మనలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన ప్రకటన ఆసక్తి రేకెత్తించింది. 'మీరంతా నేనేం చెబుతానో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని తెలుసు. 11న ఏమీ ప్రకటించక పోవడంతో నిరాశే చెంది ఉంటారు. ఈనెల 18వ తేదీన మాత్రం బిగ్ అనౌన్స్ మెంట్ చేస్తున్నాను' అంటూ మరో ఉత్కంఠకు తెరలేపారు ప్రశాంత్ కిశోర్.
ఇంతకీ ఈయన చేసే బిగ్ అనౌన్స్ మెంట్ ఏమిటా? అని రాజకీయ వర్గాలు రకరకాల లెక్కలు వేసుకుంటున్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీని తమ ప్రధాని అభ్యర్థిగా ఫోకస్ చేస్తూ 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పోరాడినప్పుడు ఆ పార్టీ తరపున పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ఆ తర్వాత పనిచేసిందంతా ప్రాంతీయ పార్టీల కోసమే (ఉత్తరప్రదేశ్ లో కూడా అసెంబ్లీ ఎన్నికల కోసమే కాంగ్రెస్ తరపున పనిచేశారు).
అందువల్ల ఆయన ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడగట్టి ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో షికార్లు చేస్తున్నాయి.