China: చైనాలో వాహన విక్రయాలు ఢమాల్!
- వాహన పరిశ్రమను అతలాకుతలం చేస్తున్న కోవిడ్-19
- గణనీయంగా పడిపోయిన వాహన విక్రయాలు
- తీవ్ర ఒత్తిడిలో వాహన పరిశ్రమ
అమెరికాతో వాణిజ్య యుద్ధం, వృద్ధి మందగమనం, ఉద్యోగాల కోత వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న చైనాను ఇప్పుడు కోవిడ్-19 (కరోనా వైరస్) అతలాకుతలం చేస్తోంది. ఓ వైపు ప్రాణాలను హరిస్తున్న ఈ వైరస్.. అన్ని రంగాలను కుదేలు చేస్తోంది. ముఖ్యంగా వాహన తయారీ పరిశ్రమను కకావికలం చేస్తోంది. గత నెలలో వాహన విక్రయాలు గణనీయంగా పడిపోవడంతో పరిశ్రమ విలవిల్లాడుతోంది.
గతేడాది జనవరితో పోలిస్తే ఈసారి వాహన విక్రయాలు 20.2 శాతం పడిపోయినట్టు చైనా వాహన తయారీ సంస్థల సమాఖ్య (సీఏఏఎం) ప్రకటించింది. అమ్మకాలు భారీగా పడిపోవడంతో వాహన తయారీ సంస్థలు తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయినట్టు తెలిపింది. వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేసేందుకు చాలా కంపెనీలు సెలవులు ప్రకటించాయి. ఫలితంగా డీలర్‌షిప్‌లు మూతబడ్డాయి. ఇది వాహన విక్రయాలను గణనీయంగా దెబ్బతీసిందని సీఏఏఎం పేర్కొంది.