Nirbhaya: జైల్లో హింసించడంతో నాకు పిచ్చెక్కింది: నిర్భయదోషి వినయ్‌శర్మ తాజా పిటిషన్
- కొనసాగుతున్న దోషుల నాటకాలు
- ఉరి శిక్ష వాయిదాకు రోజుకో ఎత్తుగడ!
- చట్టపరమైన అవకాశాలు వినియోగించుకుంటూ కాలహరణం
జనవరి 22... ఫిబ్రవరి ఒకటి... వాయిదా...వాయిదా... ఢిల్లీలో అకృత్యాలకు పాల్పడిన నిర్భయ దోషుల ఉరితీతపై ‘సాగు’తున్న ఉత్కంఠకు నిదర్శనమిది. చట్టం ముందు అందరూ సమానమేనన్న ఉద్దేశంతో రాజ్యాంగం, చట్టం ప్రసాదించిన అవకాశాలను వినియోగించుకుంటూ దోషులు రోజుకో ఎత్తుగడతో కాలహరణం చేస్తూ వస్తున్నారు.
‘నన్ను తీహార్ జైల్లో చిత్రహింసలు పెట్టారు. ఆ కారణంగా నాకు పిచ్చెక్కింది. మానసిక సమస్యతో నేను బాధపడుతున్నాను’ అంటూ తాజాగా దోషుల్లో ఒకడైన వినయ్‌శర్మ నిన్న సుప్రీంకోర్టుకు తెలిపాడు. రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చడాన్ని అతను సవాల్ చేశాడు.
తన మానసిక వ్యాధిని దేశ ప్రథమ పౌరుడు పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు. మరోవైపు పిటిషనర్ ఆరోగ్యంగానే ఉన్నాడని, ఎటువంటి మానసిక సమస్యలు లేవని కేంద్రం కోర్టుకు తెలిపింది. కాగా, పిటిషన్ ను స్వీకరించి విచారించిన ధర్మాసనం ఈ రోజుకు తీర్పు వెల్లడించనుంది.