KTR: ప్రధాని మాటలను నమ్మి పెద్ద నోట్ల రద్దుకు మద్దతిచ్చి తప్పుచేశాం: కేటీఆర్

KTR blames PM Narendra Modi on Demonitisation

  • దేశాన్ని సంపూర్ణ క్రాంతివైపు తీసుకెళ్తున్నట్టు ప్రధాని చెప్పారు
  • దేశ ఆర్థిక వ్యవస్థపై నోట్ల రద్దు పెను ప్రభావం చూపింది
  • వృద్ధిరేటు 3-4 శాతం మధ్య ఊగిసలాడడానికి కారణం ఆ నిర్ణయమే

ప్రధాని నరేంద్రమోదీ మాటలు నమ్మి, అప్పట్లో పెద్ద నోట్ల రద్దుకు మద్దతు ఇచ్చామని, అందుకు ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జాతీయ టీవీ న్యూస్ చానల్ ‘టైమ్స్ నౌ’ నిర్వహిస్తున్న సదస్సులో ‘దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర’ అన్న అంశంపై మాట్లాడిన మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆయన ఓపిగ్గా సమాధానం ఇచ్చారు.

పెద్ద నోట్ల రద్దుకు తాము పూర్తిగా మద్దతు ఇచ్చామని, దానిపై అసెంబ్లీలోనూ చర్చించామన్నారు. ఈ విషయమై తమ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానిని కలిసి మాట్లాడారని గుర్తు చేశారు. తాము సంపూర్ణ క్రాంతి వైపు దేశాన్ని తీసుకెళ్తున్నట్టు ప్రధాని చెప్పారని, ఆయన మాటలను నమ్మి నోట్ల రద్దుకు మద్దతు పలికినట్టు చెప్పారు. అప్పుడు అలా మద్దతు పలికినందుకు ఇప్పుడు మరోమాటకు తావులేకుండా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు.

నాటి నోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని, ఆర్థిక అభివృద్ధికి విఘాతం ఏర్పడిందని చెప్పారు. వృద్ధి రేటు నేడు 3-4 శాతం మధ్య కొట్టుమిట్టాడుతుండడానికి నాటి నోట్ల రద్దు నిర్ణయమే కారణమని కేటీఆర్ తేల్చి చెప్పారు.

KTR
Telangana
Demonitisation
Narendra Modi
  • Loading...

More Telugu News