Corona Virus: కరోనా భయాందోళనల మధ్య నేడు కోల్ కతాకు చేరుకోనున్న చైనా ఓడ

Cargo Ship From China To  reach Kolkata Today

  • 19 మంది క్రూ సభ్యులతో జనవరి 29న చైనా నుంచి బయల్దేరిన కార్గో షిప్
  • కోల్ కతాకు 120 కి.మీ. దూరంలో నిన్న నౌకను ఆపేసిన అధికారులు
  • వైద్య పరీక్షల అనంతరం పోర్టులో ప్రవేశించేందుకు అనుమతించిన వైనం

కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతోందని చైనా ప్రకటించినప్పటికీ... ప్రపంచ దేశాలు ఆ ప్రకటనను విశ్వసించడం లేదు. ఈ భయాందోళనల నేపథ్యంలో చైనా నుంచి బయల్దేరిన ఓ కార్గో నౌక ఈరోజు కోల్ కతాకు చేరుకుంటోంది. జనవరి 29న 19 మంది చైనీస్ క్రూ సభ్యులతో షాంఘై నుంచి ఈ నౌక బయల్దేరింది.

కోల్ కతాకు 120 కిలోమీటర్ల దూరంలో సాగర్ ఐలాండ వద్ద నిన్న ఈ నౌకను కోల్ కతా పోర్టు అధికారులు ఆపేశారు. వెంటనే ఓ వైద్య బృందాన్ని నౌకలోకి పంపించారు. నౌకలోని క్రూ సిబ్బందికి వైద్యులు కరోనా పరీక్షలను నిర్వహించారు. వీరిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేకపోవడంతో... పోర్టులోకి వచ్చేందుకు అధికారులు నౌకకు అనుమతిని ఇచ్చారు. ఈ నేపథ్యంలో, సాయంత్రం 5.30 గంటలకు కోల్ కత్తా పోర్టుకు కార్గో షిప్ చేరుకోనుంది. పోర్టుకు చేరుకున్న వెంటనే క్రూ సిబ్బందికి పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మరోసారి వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు.  

మరో వైపు, షాంఘై నుంచి ఈ నౌక బయల్దేనప్పటి నుంచి ఎప్పటికప్పుడు క్రూ మెంబర్ల శరీర ఉష్ణోగ్రతల వివరాలను కోల్ కతా వైద్య అధికారులకు షిప్ కెప్టెన్ పంపిస్తూనే ఉన్నారు. చైనాలో ఇప్పటి వరకు దాదాపు 60 వేల మంది కరోనా బారిన పడ్డారు. కనీసం 1,355 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • Loading...

More Telugu News